తెలంగాణ (Telangana)వ్యాప్తంగా భారీ వరదలు సంభవించాయి. కనీవినీ ఎరుగని రీతిలో జులై (July)నెల రెండో వారంలోనే రాష్ట్రంలో వారం పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురిసాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు, చెరువులు(Ponds) , నాలాలు(Nalas)పొంగిపొర్లాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. భారీగా ఆస్థి, పంట నష్టం సంభవించింది. రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించి పోయింది. ప్రధాన నగరాలూ, పట్టణాల్లో దైనందిన జీవితం అస్తవ్యస్తమైంది. వర్షాలకు రోడ్లన్నీ (Roads)పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పాడైయిపోయిన రోడ్లతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిష్టితి నెలకొంది.
పనులు కొనసాగిస్తున్నాయి..
ఇక భారీ వరదలు హైదరాబాద్ మహానగరాన్ని సైతం అతలాకుతలం చేశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వరదల ధాటికి నాళాలు పొంగి ప్రవహించాయి. రోడ్లపై మురుగు నీరు చేరి తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వరద ప్రవాహానికి ప్రధాన రహదారులు సైతం కొట్టుకుపోయాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా వేసిన రోడ్లపైనా కంకర తేలింది. ఎప్పుడు ఎక్కడో చోట రోడ్ల మరమ్మతులు ఉండే మహానగరంలో...వరదల ధాటికి పనులన్నీ నిలిచిపోయాయి. రోడ్లపై ఇసుక మేటలు వేసింది. భాగ్యనగరాన్ని కలుపుతూ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద..విజయవాడ జాతీయ రహదారులను కలుపుతూ ఆటో నగర్, సాగర్ రోడ్డు, నగరంలోకి వచ్చే ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్డుపై కంకర పైకి తేలింది. రహదారిపై వాహనాలు తిరగలేని పరిస్థితి నెలకొంది.
మరమ్మతుల్లో బల్దియా బిజీ ..
కాగా, గత రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. నాళాలు, రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ దృష్టిసారించింది. తక్షణ రోడ్డు మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో దెబ్బతిన్న రహదారులను బాగుచేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులు మరమ్మత్తులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో వరద నష్టంపై అధికారులు సమగ్ర నివేదిక రూపొందించనున్నారు.జులై రెండో వారంలో కురిసిన వర్షాలకే రోడ్లు ఈ విధంగా మారడంతో అగస్ట్, సెప్టెంబర్ మొదటి వారం రోజులు వర్షాలను దృష్టిలో ఉంచుకొని మరమ్మతులు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో వ్యవస్థను చక్కదిద్దే పనుల్లో బిజిగా ఉన్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GHMC, Greater hyderabad, Telangana