news18-telugu
Updated: December 1, 2020, 2:44 PM IST
మంత్రి కేటీఆర్ (ఫైల్)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు గంటలు మాత్రమే ఉంది. అయితే ఇప్పటికీ మెజార్టీ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు ఇళ్లు దాటని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఓటు వేసేందుకు పౌరులు క్యూలో ఉన్నప్పటికీ.. మరికొన్ని చోట్ల మాత్రం పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. లాక్ డౌన్ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలు ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేసింది.
ఈ విషయాన్ని తెలుపుతూ.. ఆమె మనవరాలు ట్విట్టర్లో కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ వృద్ధురాలికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగానే ధన్యవాదాలు తెలిపారు. ఓటేయకుండా కేవలం కంప్లయింట్లకు పరిమితం అయ్యే వారికి ఆమె ఓ స్ఫూర్తి అంటూ ఓటు వేయని పౌరులకు చురకలు అంటించారు.
ఇక మధ్యాహ్నం 1 గంటలవరకు వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 18.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. గుడిమల్కాపూర్‌లో అత్యధికంగా 49.19 శాతం పోలింగ్ నమోదు కాగా..అమీర్ పేట్ 0.79, తలాబ్ చంచలంలో అత్యల్పంగా 0.74 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం ముందుకొస్తున్నా.. జూబ్లీ హిల్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటు వేయడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
అయితే పది గంటల తరువాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వస్తారని రాజకీయ పార్టీలు, అధికారులు భావించారు. కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదనే విషయం ఓటింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతోంది. జూబ్లీ హిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం సిబ్బంది వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఎంతగా కోరినా.. ఓటర్లు మాత్రం వారిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే నగరంలో బస్తీలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో మాత్రం జనం ఓటు వేసేందుకు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు శివారు ప్రాంతాల్లోనూ ఓటింగ్ పర్వాలేదనిపించేలా ఉందని తెలుస్తోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
December 1, 2020, 2:40 PM IST