నేటి సాయంత్రం 5 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల ప్రచారం ముగియనుంది. డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు అధికారులు. పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్‌ను దృష్టిలో పెట్టుకొని... నవంబర్ 29 సాయంత్రం 6 గంటల నుంచే మద్యం షాపులను బంద్ చేయిస్తున్నారు. తిరిగి అవి తెరచుకునేది డిసెంబర్ 2నే. అంటే... మూడు రోజుల పాటూ మద్యం దొరకదు. మందు బాబులకు మూడు రోజులంటే... మూడు నెలలతో సమానం. ప్రతి రోజూ నోట్లో పెగ్గు దిగందే నిద్ర పట్టదు కొందరికి. అందువల్ల అలాంటి వాళ్లంతా ఇప్పుడు లబలబ లాడుతున్నారు. మద్యం కోసం సిటీ దాటి వెళ్లాల్సిందేనా అని ఆవేదన చెందుతున్నారు.
కలిసొచ్చిన ఎన్నికలు: నిజానికి ఈ ఎన్నికలు చాలా మంది పేద మందు బాబులకు బాగా కలిసొచ్చాయి. ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన డబ్బుతో మద్యం ఎక్కువగానే కొనుక్కున్నారు. చికెన్ బిర్యానీ అమ్మకాలు కూడా GHMC పరిధిలో విపరీతంగా పెరిగాయి. 10 రోజులుగా ప్రతి రోజూ పండగే అన్నట్లు అయిపోయింది. ఇవాళ సాయంత్రం నుంచి లిక్కర్ షాపులు బంద్ ఉంటాయని తెలిసే... ఇవాళ్టికి కావాల్సిన మందును నిన్నే కొనేసుకున్నారు. మార్నింగ్ నుంచి కూడా కొనుగోళ్లు జోరుగానే ఉన్నాయి. ఎటొచ్చీ... రేపు, ఎల్లుండి ఎలా గడవాలన్నదే వారి ముందున్న అతి పెద్ద సమస్య.
ఆబ్కారీ యాక్షన్:
కొంత మంది రాజకీయ నేతలు, చోట మోటా నాయకులు... ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే... సంబరాలు చేసేందుకు భారీ ఎత్తున మద్యాన్ని కొంటున్నారు. ఇలాంటి బల్క్ మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. వీటిపై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒక వ్యక్తికి లేదా సమూహానికి బల్క్ మద్యం అమ్మితే... సంబంధిత మద్యం షాపులపై ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు.
సరిహద్దుల్లో నిఘా:
నిషేధం ఉన్న రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు, RTA అధికారులు కలిసి ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. సో... GHMC పరిధిలో మద్యం సాయంత్రం వరకే. ఆ తర్వాత డిసెంబర్ 2వరకూ ఆగాల్సిందే. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4న రానున్నాయి. ఆ రోజున మద్యం నదిలా పారడం ఖాయమంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.