మాజీ క్రికెటర్ VVS Laxman పోటీ చేయబోయే నియోజకవర్గం ఏదో తెలుసా? -పొలిటికల్ ఇన్నింగ్స్ ఇలా..

వీవీఎస్ లక్ష్మణ్

భారత క్రికెట్ చరిత్రలో తనదైన స్పెషల్ పేజీలు లిఖించిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కొత్తగా పొలిటికల్ ఆరంభించనున్నాడు. జాతీయ పార్టీలో వీవీఎస్ చేరికకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలోని కీలకమైన నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ఎన్నికల బరిలోకి దిగుతారని సమాచారం..

  • Share this:
వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్ అలియాస్ వీవీఎస్ లక్ష్మణ్.. ముద్దుగా వెరీ వెరీ స్పెషల్... ప్రపంచ క్రీడాభిమానుల్లో బహుశా ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు. వందేళ్లకుపైబడిన భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని విజయాలెన్నింటినో మనకందించిన లక్ష్మణ్ అతి త్వరలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ గడ్డపై క్రీడా, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తోన్న అతను ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం లక్ష్మణ్ త్వరలోనే బీజేపీ పార్టీలో చేరబోతున్నాడు..

టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ కు చెందిన లక్ష్మణ్ భారత జట్టుకు కీలకమైన విజయాలెన్నో అందించి, 2012లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ టోర్నీలో డెక్కన్‌ చార్జెస్‌ కు కెప్టెన్‌ గా వ్యవహరించాడు. వయసు మీద పడుతుండటంతో ప్రస్తుతం హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా కొనసాగుతున్నాడు. ఆటగాడిగా రిటైరైన తర్వాత హైదరాబాద్ సిటీలోనే అకాడమీ స్థాపించిన లక్ష్మణ్ పేద పిల్లలకూ క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నాడు. పదుల కొద్దీ స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న లక్ష్మణ్ సామాజిక సేవలోనూ అగ్రభాగన ఉన్నారు. వీవీఎస్ ఫౌండేషన్ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగానే బీజేపీ తెలంగాణలోనూ సెలబ్రిటీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుండటం, అందులో భాగంగా కమలం పార్టీకి చెందిన పలువురు సీనియర్లు వీవీఎస్ తో వరుస భేటీలు నిర్వహించడం, పార్టీలో చేరికకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేయడం తెరవెనుక చకచకా జరిగిపోయినట్లు తెలిసింది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.

తెలంగాణలో అధికార సాధనే ధ్యేయంగా పనిచేస్తోన్న బీజేపీకి లక్ష్మణ్ చేరిక ద్వారా మరింత బలం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధమున్న లక్ష్మణ్ ను GHMC పరిధిలోనే ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ భావిస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనుక అసెంబ్లీకి(అంబర్ పేట నుంచి) పోటీ చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష్మణ్ ను బరిలోకి దించాలని, అలా కాని పక్షంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే వీవీఎస్ ను నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ పొలిటికల్ ఇన్నింగ్స్ పై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Published by:Madhu Kota
First published: