హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Floods: వరద సాయం అందడం లేదని బాధితుల ఆందోళన.. పలు చోట్ల రోడ్లపై బైఠాయించి నిరసనలు

Hyderabad Floods: వరద సాయం అందడం లేదని బాధితుల ఆందోళన.. పలు చోట్ల రోడ్లపై బైఠాయించి నిరసనలు

అంబర్‌పేటలో వరద బాధితుల ఆందోళన(Image source-Twitter)

అంబర్‌పేటలో వరద బాధితుల ఆందోళన(Image source-Twitter)

హైదరాబాద్‌లో వరద బాధితుల పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం అందడం లేదని నిరసనకు దిగుతున్నారు.

  హైదరాబాద్‌లో వరద బాధితుల పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వరద సాయం అందడం లేదని నిరసనకు దిగుతున్నారు. శనివారం కూడా నగరంలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే డబ్బులు అందుతున్నాయని.. తమలాంటి అసలైన బాధితులకు సాయం చేరడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న వరద బాధితులను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబర్‌పేటలో వరద బాధితుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ముందు పెద్ద సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన చేపడుతున్నప్పుడే గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

  ఇక, ఉప్పల్ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న వరదల బాధితులు.. ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరద సాయం అందడం లేదని ఈ సందర్భంగా బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార పార్టీ నేతలు వివక్ష చూపెడుతున్నారని మండిపడ్డారు. రోడ్డుపై నిరసనకు దిగారు. ఉప్పల్‌లో నిరసన చేపట్టిన వరద బాధితులకు ఉప్పల్ కార్పొరేటర్ భర్త హనుమంత్‌రెడ్డి మద్దతు తెలిపారు.

  ఉప్పల్, అంబర్‌పేట మాత్రమే కాకుండా.. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, జీడిమెట్ల, కర్మన్‌ఘాట్‌లలో కూడా వరద బాధితులు సాయం కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మరోవైపు గాజులరామారంలో ఆందోళన చేపట్టిన వరదబాధితులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మద్దతు తెలిపారు.

  ఇటీవల కురిసి వర్షాలు హైదరాబాద్ మహానగరంలో భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. దాదాపు వందేళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు రావడంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. పదులు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. అయితే ఈ క్రమంలోనే వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సాయంగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకొచ్చారు. వరద బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున సాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో వరద సాయం కింద డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే తమకు పరిహారం అందడం లేదని ఇలా పెద్ద ఎత్తున వరద బాధితులు రోడ్లపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Hyderabad Floods

  ఉత్తమ కథలు