హైదరాబాద్ వరదల సమయంలో తమను ఆదుకోలేదంటూ పలు ప్రాంతాల్లోని ప్రజలు పాలకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. వరద బాధితుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించడానికి తన నియోజకవర్గ పరిధిలోని ఓ మీ సేవ కేంద్రానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెళ్లారు. అక్కడ వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనపై ఆగ్రహంతో ఉన్న బాధితులు.. ఎమ్మెల్యేను చూసిన వెంటనే మరింత ఫైర్ అయ్యారు.
ఎమ్మెల్యేను చూసి తిట్ల పురాణం అందుకున్నారు. ఎమ్మెల్యేతోపాటు అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలను సైతం బాధిత మహిళలు నిలదీశారు. ఇన్ని రోజులు ఏమైపోయారంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. చేసేది లేక అక్కడి నుంచి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెళ్లిపోయారు. గ్రేటర్ ఎన్నికలకు ముందుకు తమ నేతలకు ఈ రకమైన అనుభవాలు ఎదురుకావడం టీఆర్ఎస్ శ్రేణులకు కలవరానికి గురి చేస్తోంది.
ఇదిలా ఉంటే వరద బాధితులకు నగదు సాయం అందజేసే విషయంలో ప్రభుత్వ సరిగ్గా వ్యవహరించలేదని... అనేక మంది బాధితులకు సాయం అందలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో నగదు సాయం రాని బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వారికి నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే నగదు బదిలీ చేస్తామని తెలిపింది. దీంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో వరద బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసేందుకు వేచి చూస్తున్నారు. మరోవైపు వరద బాధితులకు నగదు బదిలీ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. అలాంటి వారికి కేవలం బ్యాంకు అకౌంట్లోనే నగదు బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.