Hyderabad Rains: హైదరాబాద్‌లో వరద బీభత్సం.. వీడియోలు

చార్మినార్

మరో రెండు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం 14, 15 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

 • Share this:
  తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం వణికిపోతుంది. రెండు రోజుల పాటు కుంభవృష్టి కురవడంతో నగరం మొత్తం నీట మునిగిపోయింది. వర్షం తెరిపినిచ్చినా ఇంకా కాలనీల్లో వాన నీరు ఇంకలేదు. ఇంకా రోడ్ల మీద వర్షం నీరు పారుతూనే ఉంది. ఆ దృశ్యాలు చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీరు చేరాయి. అపార్ట్ మెంట్లలోకి నీరు వచ్చాయి. ప్రజలకు బయటకు రాలేని పరిస్థితి. ఇక ప్రయాణాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. అసలు రోడ్డుమీద అడుగుపెట్టడానికి కూడా భయమేస్తుంటే, ఇక ప్రయాణం సంగతి దేవుడెరుగు అన్నట్టుగా మారింది.
  హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు వర్షాలు, వరదల కారణంగా 15 మంది చనిపోయారు. హైదరాబాద్‌లోని గగన్ పహాడ్ వద్దే మిద్దెకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో ఎడతెరిపి లేని వర్షానికి బుధవారం రాత్రి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. కొండ హనుమంతు రెడ్డి(70), భార్య కొండ అనసూయమ్మ(55), మనవడు హర్షవర్ధన్ రెడ్డి(12) లు మృతి చెందగా మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పుర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామంలో కార్ లో ఇద్దరు గల్లంతు అయ్యారు. లష్కర్ గూడ వాగు లో కారులో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఘటన ప్రదేశానికి మూడు కిలోమీటర్ల దూరంలో వారిలో ఒకరైన వెంకటేష్ గౌడ్ మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి రాఘవేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  ఇక హైదరాబాద్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీంతో వారికి భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూసారాంబాగ్ లోని సలీం నగర్ లో ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న 1, 2 రోజులపాటు భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉండాలని మంత్రి వారిని కోరారు. ఆయా కేంద్రాల్లో ఆహారం తో పాటు, మందులు, వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల తో కలిసి చాదర్ ఘాట్ వద్ద ఉన్న మురికి నాలాని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.

  హైదరాబాద్‌కు చెందిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. మూసారాం బాగ్ వంతెన వరద నీటితో పాక్షికంగా దెబ్బతిన్నది. అంతేకాకుండా వంతెన పై నుండి నీరు ప్రవహిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పరిశీలించారు. తక్షణమే ఈ వంతెన పై రాకపోకలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతంరం బేగంపేట లోని ప్రకాష్ నగర్ లో వరదనీరు పెద్ద ఎత్తున నిలిచిపోయి ఇండ్లలోకి చేరడంతో ఆప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే 2 బోట్లను తెప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావానికి గురైన వారిని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

  మరోవైపు మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో చరిత్రలో ముందెన్నడూ లేనిరీతిలో ఒక్కసారిగా వరద ఉధృతి తీవ్రమైనట్టు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. దీంతో  అప్పటికప్పుడు అదే రాత్రి సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టర్ల  తోపాటు నీటిపారుదల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలని అధికారులను ఆదేశించారు.

  మరో రెండు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ప్రభుత్వం 14, 15 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్థాయిల అధికారులను అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం జీహెచ్ఎసీ టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది తో పర్యవేక్షణ జరుపుతూ సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: