హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దక్కన్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదం జరిగిన దగ్గరి నుంచి ఈ ప్రమాదాల పరంపర ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అగ్నిప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా నగరంలోని జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కక్కడే దుర్మరణం పాలయ్యారు.
జీడిమెట్లలోని ఓ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి రియాక్టర్ పేలిపోయింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిపోయాయి. దీనితో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిన అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా కొన్నిరోజుల క్రితం..చిక్కడపల్లి విఎస్టి (VST) సమీపంలో ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ప్రమాద దాటికి గోదాంలోని అన్ని వస్తువులు కాలిపోయాయి. డౌన్ లో డెకరేషన్ కు సంబంధించిన వస్తువులైన స్పాంజి, డెకరేషన్ క్లాత్స్, టెంట్, ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
ఈ మంటల ధాటికి దట్టమైన పొగ గోడౌన్ ను కమ్మేసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు 2 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినా కూడా దట్టమైన పొగ రావడంతో చుట్టు పక్కల ఇళ్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల దక్కన్ మాల్ లో జరిగిన ప్రమాదం మరువక ముందే అనేక అగ్నిప్రమాదాలు జరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. రానుంది ఎండాకాలం కావడంతో అగ్నిప్రమాదాలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Fire Accident, Hyderabad, Telangana