అక్కడ నిన్నటి వరకు ఒక లెక్క ..ఇప్పటి నుంచి మరో లెక్క. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే మీ జేబులకే చిల్లిపడుతుంది జాగ్రత్త. సిటీలో అన్నీ చోట్ల ఒకే రూల్ అమలు చేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..అక్కడ మాత్రం వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చుక్కలు చూపిస్తామంటున్నారు. ఆ విషయాన్ని హెచ్చరిస్తూ ప్రత్యేకమైన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్(Hyderabad) మహానగరాన్ని చూడటానికి వచ్చే వాళ్లకు ముందుగా కనిపించే టూరిస్ట్ స్పాట్ హుస్సేన్‌సాగర్(Hussain Sagar). ఒకరంగా ఇది సిటీకి ఐకాన్ సింబల్‌గా కూడా చెప్పుకుంటారు. సిటీకి మధ్యలో ఉండటం కారణంగా ఇక్కడికి స్థానికులతో పాటు నగరానికి వేర్వేరు పనులపై బైకులపై వచ్చిపోయే వాళ్లు ఖచ్చితంగా ఆగి మరీ చూస్తారు. ముఖ్యంగా హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్(Secunderabad)ని కలుపుతూ ఏర్పాటు చేసిన ట్యాంక్‌బండ్(Tank Bund)పై నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డుకు మరోవైపు గార్డెనింగ్ చేసి ఉండటంతో సాయంత్రం వేళ బైక్‌లపై వచ్చి రిలాక్స్ అవుతూ హుస్సేన్ సాగర్‌ని చూసేవాళ్లకు పోలీసులు గట్టి వార్నింగ్ (Warning)ఇస్తున్నారు. ఇకపై ట్యాంక్‌బండ్‌పైన ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్(Parking)చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పోలీసులు కేటాయించిన పార్కింగ్ ప్లేసులు మినహాయించి ఎక్కడ వాహనాలు నిలిపివేసిన వెయ్యి రూపాయలు ఫైన్(Fine)వసూలు చేస్తామని ప్రకటించారు.
ట్యాంక్‌బండ్ రూట్‌లో డేంజర్ ..
ట్యాంక్ బండ్ మార్గంలో బైక్‌పై వెళ్లే వారు హుస్సేన్‌సాగర్‌ని చూసేందుకు లేదంటే ఓ దమ్ము కొట్టేందుకు బైక్‌ని పక్కన పార్క్ చేయడం కుదరదంటూ నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఒకవేళ నో పార్కింగ్ జోన్‌లో అధికారుల రూల్స్ బేఖాతరు చేసి ఎవరైనా వాహనాలు పార్క్ చేస్తే వెంటనే వారి మొబైల్ ఫోన్‌కి 1000రూపాయల ఫైన్ పడినట్లుగా మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నగరపౌరులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు.
బైక్ ఆపితే వెయ్యి ఫైన్..
ట్యాంక్‌బండ్‌పై నో పార్కింగ్ బోర్డులతో పాటు స్పీడ్ గన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. బైకర్స్ అతివేగంగా వెళ్లడం కారణంగా రోడ్డు దాటే క్రమంలో పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈవిషయాన్ని గుర్తించిన పోలీసులు నో పార్కింగ్ బోర్డులు పెట్టిన చోట స్పీడ్ గన్‌లను ఫిక్స్ చేశారు. ఈ నో పార్కింగ్ బోర్డులు ట్యాంక్‌బండ్‌పై ఒక్కచోట కాకుండా దారి పొడవున ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొద్ది దూరం పోయిన తర్వాత అయినా వాహనదారులు బైక్ పార్క్ చేసే అవకాశం ఉండటంతో ఈ కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. నగరంలో ఉండే వాహనదారులు ట్యాంక్‌బండ్ మార్గంలో వెళ్తే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి లేదంటే చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మర్చిపోకండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.