భారత్ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న నాందేడ్ బహిరంగ సభకు 60 కిలోమీటర్ల దూరంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. గతంలో మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం ఘటన అందరికీ తెలిసిందే. అదే బెల్ట్‌లో ఉన్న హింగోలి జిల్లాలో తాజాగా భూకంపం సంభవించింది. ఆ జిల్లాలోని నాందాపూర్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై 3.1 గా నమోదయినట్లు సమాచారం. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భూకంపం సంభవించగా.. దాని ప్రకంపనల ప్రభావం సుమారు 25 నిమిషాల వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
హింగోలి జిల్లా పరిసర ప్రాంతాలైన నాందేడ్, లాతూర్, జాల్న, పర్భని తెలంగాణలోని నిజామాబాద్ , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల సమీపం దాకా దీని ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు అత్యంత సమీపంలోనే భూకంపం రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూకంపం ఉదయం సంభవించగా.. దీని ప్రభావం పెద్దగా చూపలేదు. భూకంపం ప్రభావం ఏమంతగా లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపీరి పీల్చుకున్నారు. అయితే నాందాపూర్ కేంద్రంగా గతంలోనూ స్వల్ప భూకంపాలు సంభవించినట్లు అధికార వర్గాలతో పాటు మహారాష్ట్ర వాసులు చెబుతున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ సభతో నాందేడ్ పట్టణంతోపాటు సభ స్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్లమేర గులాబీ మయమయ్యాయి. అక్కడ వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు సభా స్థలిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహారాష్ట్రలో తొలి సభను భారత రాష్ట్ర సమితి నిర్వహిస్తుండడం ఈ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు భారీ సంఖ్యలో పార్టీ ప్రముఖులు హాజరు అవుతుండడం.. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖులు కొందరు పార్టీలో చేరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News