స్మితా సభర్వాల్ ఇంటికి అర్ధరాత్రి వేళ ఎందుకు వెళ్లారో చెప్పిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి. సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించిన కేసులో నిందితుల రెండ్రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కస్టడీలో నిందితులిద్దరూ పోలీసు విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఈ కేసులో అరెస్టు అయిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ పదోన్నతి గురించి మాట్లాడేందుకే స్మిత సబర్వాల్ ఇంట్లోకి వెళ్లానని పోలీసులకు వెల్లడించాడు.
గత డిసెంబరు 19న కూడా వెళ్లానని ఆమె లేకపోవడంతో వెనక్కి వచ్చేశానని చెప్పాడు. తనకు మరో ఉద్దేశం లేదని వివరించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఇంట్లోకి రాత్రివేళ ప్రవేశించి పోలీసులకు పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు. డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతి విషయమై మాట్లాడేందుకే స్మితా సభర్వాల్ ఇంటికి వెళ్లినట్టు పోలీసుల విచారణలో ఆనంద్‌కుమార్ రెడ్డి తెలిపాడు. అయితే, రాత్రివేళ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.
1996 గ్రూప్-2లో ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపు 26 మంది అభ్యర్థుల పోస్టులు కోర్టు వివాదంలో ఉన్నాయని, వారిలో 18 మందిని ఏపీకి కేటాయించగా, 10 మందికి తెలంగాణలో పోస్టింగులు వచ్చాయని వివరించాడు. వారిలో తాను కూడా ఒకడినని చెప్పుకొచ్చాడు. ఏపీకి వెళ్లిన వారికి పదోన్నతలు వచ్చాయని, కానీ తామింకా డిప్యూటీ తహసీల్దార్లుగానే మిగిలిపోయామని, ఈ విషయం గురించి మాట్లాడేందుకే ఆమె ఇంటికి వెళ్లినట్టు పోలీసులకు వివరించాడు.
ప్లజెంట్ వ్యాలీలో స్మితా సభర్వాల్ నివసిస్తున్న ఫ్లాట్‌లోకి ఈ నెల 19న రాత్రి ఆనంద్‌కుమార్ రెడ్డి తన స్నేహితుడు కొత్తబాబుతో కలిసి వెళ్లాడు. కొత్తబాబును బయటే ఉంచి లోపలికి వెళ్లిన ఆనంద్‌కుమార్‌ను స్మిత ఇంటి బెల్ కొట్టాడు. తలుపు తీసి చూసిన ఆమె కేకలు వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆనంద్‌కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, టీ తాగేందుకు వెళ్దామని తీసుకొచ్చి ఇరికించాడంటూ కొత్తబాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
అర్ధరాత్రి ఎవరు కాలింగ్ బెల్ కొట్టారని సంశయిస్తూనే స్మితా సబర్వాల్ ఇంటి తలుపు తెరిచారు. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి ఉండటంతో ఖంగుతున్న ఆమె.. మీరు ఎవరు ? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు ? మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు ? అంటూ అతడ్ని ప్రశ్నించారు. తాను డిప్యూటీ తహసీల్దార్‌ని అని తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని అతడి చెప్పటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News