Home /News /telangana /

HYDERABAD CYBERCRIMINALS WHO DEFRAUDED BTECH STUDENTS OF JOBS IN THE NAME OF A LIMITEX COMPANY AT MADHAPUR IN TELANGANA VB

Cyber Crime: ‘లిమిటెక్స్’లో ఉద్యోగాలంటూ ప్రకటన.. బీటెక్ విద్యార్థుల నుంచి విపరీతమైన స్పందన.. చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం (Image credit : twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image credit : twitter)

Cyber Crime: చదివిన చదువులో వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా పనితీరు ఆధారంగా ఉద్యోగం ఇస్తామంటే బీటెక్ విద్యార్థులు నమ్మారు. గూగుల్ సెర్చ్ లోని ఒక వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. డబ్బులను కట్టి నిలువునా మోసపోయారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలల్లో పూర్తి అవుతుంది. అయితే బీటెక్ చదివేటప్పుడే ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం వచ్చిందంటే అతడి జీవితం సెటిల్ అయినట్లే. అలా కాకుండా బయటకు వచ్చి ఉద్యోగం కోసం చూసేవాళ్లకు జాబ్ సంపాదించడం అనేది కష్టంగా మారుతుంది. ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు బయటకు వస్తున్నారు. ఉద్యోగాలు తక్కువగా ఉండగా.. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్లు మాత్రం ఎక్కువగా ఉంటున్నారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్లు వివిధ ప్లాట్ ఫాం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు. కొంతమంది ఏజెన్సీ వాళ్లను సంప్రదిస్తారు.. మరికొంత మంది గూగుల్ లో వెతుకుతుంటారు. ఇలా గూగుల్ లో ఉద్యోగం కోసం వెతికిన కొంతమంది బీటెక్ విద్యార్థులను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని బీటెక్ విద్యార్థులను మోసం చేసి రూ. 27 లక్షలకు పైగా వసూలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    వారంతా ఇంజనీరింగ్ కోర్సులు చదివిన నిరుద్యోగులు. కుటుంబ పరిస్థితుల కారణంగా పై చదువుల కంటే ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనే ఉద్దేశంతో గూగుల్ లో వెతుకులాట ప్రారంభించారు. ఒక వెబ్ సైట్ లో ఆకర్షణీయమైన ప్రకటన కనిపించింది. చదవిన కోర్సులో మార్కులను చూసి కాకుండా.. ముందుగా పనితీరు ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తామంటూ ప్రకటించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెంబరులో సంప్రదించమని సూచించారు. ఇంకేముంది ఉద్యోగం దొరకుతుందని సంబరపడ్డారు. అంతేకాదు మార్కుల కంటే ఉద్యోగంలో మనం చూపే పనితీరు ఆధారంగా వేతనాలు ఇస్తామనే షరతులు చూసి మరింత పొంగిపోయారు. గూగుల్ సెర్చ్ లోని ఒక వెబ్ సైట్ లో వచ్చిన ప్రకటన ఫోన్ నెంబర్ కు కాల్ చేశారు. ఫోన్ కాల్ ఎత్తిన వ్యక్తి హుందాగా మాట్లాడారు. నేనే సీఈఓను.. లిమిటెక్స్ పేరుతో మాదాపూర్ వద్ద ఓ పెద్ద కంపెనీ పెట్టాను.. నేనే స్వయంగా ఉద్యోగులను తీసుకుంటున్నానని నమ్మబలికాడు.

    ఫోన్ లో చెప్పిన వ్యక్తికి ఆలస్యం చేయకుండా తమకు తగిన పోస్టు కోరుకుంటూ.. ఆన్ లైన్ లో సూచించినట్లు రూ.50 వేలు, లక్ష వరకు పంపుకున్నారు. డబ్బులు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాక.. అదిగో.. ఇదిగో అంటూ అపాయింట్ మెంట్ లెటర్ కోసం కాలయాపన చేస్తుంటే వీరికి అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీసేసరికి ఆ ఫోన్ స్విచాఫ్ లో పెట్టేశాడు. అనుమానంతో మాదాపూర్ ఏరియాలో వెదికిన వారికి, తెలిసిన వారితో ఆరా తీస్తే అక్కడ.. ఆ ప్రాంతంలో ఎక్కడా ‘లిమిటెక్స్’ పేరుతో ఎలాంటి ఆఫీసు లేదని తేలింది. మోసపోయామని గుర్తించిన పలువురు బీటెక్ అభ్యర్థులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. బ్యాంకు అకౌంట్ నెంబర్ ఆధారంగా లిమిటెక్స్ కంపెనీ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా వివరాల పై ఆరా తీశారు. ఉద్యోగ ప్రకటన చూసి దాదాపు 40 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు రూ.27.30 లక్షలు ఇచ్చుకున్నట్లు తేలింది. ఇప్పటి వరకు తేలిన బాధితులే కాకుండా మరికొంత మంది మోసపోయి ఉంటారని భావిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: CYBER CRIME, CYBER FRAUD, Employees, Hyderabad

    తదుపరి వార్తలు