ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలతో పేద ప్రజలు బ్రతకడమే కష్టంగా మారింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యుల జేబుకు చిల్లు తప్పడం లేదు. ఇక ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు కరెంటు బిల్లుల పెంపు ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈసారి ఛార్జీలను పెంచకుండా ఇంధన ధర సర్దుబాటు ఛార్జీని కరెంటు బిల్లులో అదనంగా వసూలు చేయాలని డిస్కంలు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీనితో యూనిట్ కు 30 పైసలు FCA వసూలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఛార్జీలను కలపాలని నిర్ణయించారు. బొగ్గు ధరలు, ఇంధన ధరల ఆధారంగా అదనపు FCA వసూలు చేయనున్నట్టు డ్రాఫ్ట్ ఫైల్ లో డిస్కంలు పేర్కొన్నాయి.
అప్పుల ఊబిలో విద్యుత్ సంస్థలు..సర్కార్ ఓకే చెబుతుందా..
ప్రస్తుతం విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా డిస్కంల ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే డిస్కంల ప్రతిపాదనకు TSERC ఆమోదం తెలిపింది. అయితే తమను అప్పుల బాధ నుండి బయటపడేయానికి సబ్సిడీలు ఇవ్వాలని డిస్కంలు ఎప్పటి నుండో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.
FCA ఛార్జీలు పెంపు..
అయితే ఈ ఏడాది ఇప్పటికే కరెంటు చార్జీల పెంపు, అలాగే మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్న క్రమంలో ప్రభుత్వం ఛార్జీలు పెంచకపోవడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు. దీనితో ఛార్జీలను పెంచకూడదని డిస్కంలు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల టారిఫ్ లలో ఎలాంటి మార్పులు లేకుండా FCA రూపంలో ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఛార్జీల పెంపు చేయకున్నా కూడా FCA రూపంలో కూడా బిల్లులు పెరిగి ప్రజలపై భారం పడనుంది. అయితే ఇది వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుండి అమల్లోకి రానుంది.
ఇప్పటికే ఈ ఏడాదిలో ఛార్జీల పెంపు..
ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే డొమెస్టిక్ కస్టమర్లకు యూనిట్ కు 50 పైసలు, నాన్ డొమెస్టిక్ కస్టమర్లకు యూనిట్ కు రూ.1 పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో ఇక ఛార్జీల పెంపు ఉండదని అంతా భావించారు. కానీ డిస్కంలు మాత్రం ఛార్జీల రూపంలో కాకుండా FCA రూపంలో ప్రజలపై భారం వేయడానికి సిద్ధం అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Current bill, Hyderabad, Telangana, Telangana News