ప్రపంచ విప్లవ యోధుడు కామ్రేడ్ చేగువేరా (Che Guevara) కుమార్తె, మనవరాలు హైదరాబాద్‌లో సందడి చేశారు. హైదరాబాద్ నగర పర్యటకు వచ్చి చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఆచార్య ఎస్తేషానియా.. ఆదివారం మధ్యాహ్నం సీపీఐ కార్యాలయాన్ని సందర్శించారు. హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్ధూం భవన్‌కు వెళ్లారు. అక్కడ వారికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,ఇతర సీపీఐ నాయకులు, పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలు, మహిళా నాయకులు పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. కొందరు కానుకలను కూడా అందజేశారు. అనంతరం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. చే గువేరా కుమార్తె సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చే అనేది వారి ఇంటి పేరన్న ఆయన.. ఇప్పుడది యావత్ ప్రపంచాన్ని ఉత్తేజ పర్చుతోందని అన్నారు. భారతదేశంలో భగత్ సింగ్ ఎలాగో... ప్రపంచానికి చే గువేరా అలాంటి గొప్ప వ్యక్తి కొనియాడారు. ఎప్పటికైనా కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందని చెప్పారు కూనంనేని సాంబశివరావు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడిన అలైదా గువేరా.. క్యూబా ప్రజలు పేదోళ్లలా బతికి.. ధనవంతుల్లా మరణిస్తారని అన్నారు. తమ దేశంలో మహిళా ఫెడరేషన్ ఉంటుందని .. ఆడమగా వ్యత్యాసం ఏమాత్రం ఉండదని చెప్పారు. సమాన పనికి.. సమాన వేతనం కల్పిస్తారని వెల్లడించారు.
కాగా, నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (NCSC), ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (AIPSO) కలిసి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకే హైదరాబాద్‌కు వచ్చారు. వారితో ఫొటోలు దిగేందుకు కమ్యూనిస్టు నేతలు, కమ్యూనిస్ట్ సానుభూతి పరులు పోటీ పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPI, Hyderabad, Local News, Telangana