హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: క్లాస్ రూమ్ బయట నిలబెట్టారని మనస్థాపం.. ఉరేసుకొని 13 ఏళ్ల బాలిక మృతి

Hyderabad: క్లాస్ రూమ్ బయట నిలబెట్టారని మనస్థాపం.. ఉరేసుకొని 13 ఏళ్ల బాలిక మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hayatnagar Student Suicide: స్కూళ్లో టీచర్లు తనను తరగతి బయట నిలబెట్టి అవమానించారన్న మనస్థాపంతో 13 బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించింది

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఇటీవల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. టీచర్లు తిట్టారని.. మిత్రుడు అవమానించాడని.. ప్రేమలో మోసపోయానని.. ఇలాంటి కారణాలతో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూళ్లో టీచర్లు తనను తరగతి బయట నిలబెట్టి అవమానించారన్న మనస్థాపంతో 13 బాలిక ఆత్మహత్య  (School Student Suicide) చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించింది. హయత్‌నగర్‌ (Hayatnagar student suicide)లోని బంజారా కాలనీలో గురువారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.  కుటుంబ సభ్యుల చెప్పిన వివరాల ప్రకారం.. మృతురాలి పేరు అక్షయ. ఆమె ఫ్యామిలీ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం. తమ కూతురి చదువు కోసమే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. హయత్‌నగర్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలోని శాంతినికేతన్ స్కూల్లో ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఐతే తరగతి గదిలో రోజూ కుర్చొనే స్థానంలో కాకుండా..గురువారం వేరొక స్థానంలో కూర్చుతుంది. అక్షయ, తన స్నేహితురాలు తాము కూర్చునే స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. ఇది గమనించిన ఓ ఉపాధ్యాయుడు తనకు చెప్పకుండా ఎందుకు ప్లేస్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరినీ కాసేపు బయట నిలబడాలని శిక్ష వేశాడు. అనంతరం తరగతి గది నుంచి వెళ్లిపోయాడు. కాసేపటికే అటుగా వెళ్లిన మరో ఉపాధ్యాయుడు.. బయట ఎందుకు నిలబడ్డారు? క్లాస్ రూమ్‌లోకి వెళ్లాలని చెప్పడంతో.. వారు క్లాస్‌లోకి వెళ్లి కూర్చున్నారు. కొద్దిసేపటికి.. వారిని బయట నిలబెట్టిన ఉపాధ్యాయుడు వచ్చి.. మళ్లీ క్లాస్‌లోకి ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫలానా టీచర్ చెబితేనే వెళ్లామని వారు సమాధానం చెప్పారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడు సదరు టీచర్‌కి వద్దకు వెళ్లి అడగడంతో.. తానేమీ చెప్పలేదని అతడు మాట మార్చాడు. దాంతో మొదటి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను చెప్పనిదే.. లోపలికి ఎలా వెళ్తారని మండిపడ్డాడు. అనంతరం ఇద్దరినీ రెండు పీరియడ్‌ల పాటు బయటే నిలబెట్టాడు.  సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత ఐదు గంటల సమయంలో ఇంటికెళ్లింది అక్షయ. స్కూల్‌లో జరిగినది తలచుకొని బాధపడింది. టీచర్ క్లాస్ రూమ్ బయట నిలబెట్టి తనను అవమానించాడని మనస్థాపానికి గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఊరికి వెళ్లారు. కాసేపటి తర్వాత తండ్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ ఆమె తీయలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందించడం లేదు. అక్షయ తండ్రి పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పడంతో.. వారు ఇంటికి వెళ్లి కిటికీలో నుంచి చూశారు. ఫ్యాన్‌కు వేలాడు అక్షయ కనిపించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు హుటాహుటిన హయత్‌నగర్‌లోని తమ నివాసానికి వచ్చారు. అక్షయ చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టీచర్ మందలించడం వల్లే తమ కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్షయ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు శాంతినికేతన్ స్కూల్ వద్ద ఆందోళన చేశారు. పాఠశాల భవనం అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వెళ్లి వారికి నచ్చజెప్పి.. అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు