పోనీ పాపం అని మహిళ లిఫ్ట్ ఇస్తే.. పోకిరి పనిచేశాడో కానిస్టేబుల్. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఓ మహిళ కారులో వెళ్తోంది. ఆ సమయంలో ఓ వీరబాబు అనే కానిస్టేబుల్ ఆమెను లిఫ్ట్ అడిగాడు. పోలీస్ డ్రెస్సులో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను చూసి అయ్యోపాపం అనుకుంది. పోనీలే అని అతడికి లిఫ్ట్ ఇచ్చింది. కారు ఎక్కిన తర్వాత అతడు తాను సీఎం క్యాంప్ ఆఫీసు వరకు వెళ్లాలని చెప్పాడు. ఆమె చేసిన సాయానికి చాలా థాంక్స్ అంటూ మాటలు కలిపాడు. ఏమైనా సాయం కావాలంటే తనకు చెప్పాలంటూ ఆమెకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. తన అసలు రూపం బయటపెట్టాడు. ఆమెకు ఫోన్ చేయడం, పదే పదే విసిగించడం, మెసేజ్లు పంపాడు. సాయం చేయడానికి లిఫ్ట్ ఇస్తే.. తనకే సమస్య వచ్చిందని బాధపడిన మహిళ ఆ పోలీస్ కానిస్టేబుల్ వైఖరితో విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ వీరబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 12వ బెటాలియన్ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ వీరబాబును విధుల నుంచి సస్పెండ్ చేశారు. సీపీ అంజనీకుమార్ స్పందిస్తూ... చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. యూనిఫాంలో ఉన్న ఇటువంటి నేరస్థులు సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి నుంచైనా ఎటువంటి న్యూసెన్స్ను భరించవద్దన్నారు. ఎటువంటి దుష్ప్రవర్తనపై వాట్సాప్ నెంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.