తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచారం (amnesia pub rape case) వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) స్పందించారు. తెలంగాణ సాధించింది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికి కాదని.. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోందని భట్టి విమర్శించారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో భట్టి మాట్లాడారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు (drugs) అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తును ఎందుకు ఆలస్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. హోంమంత్రి మహమూద్ అలీని (mahmood ali) కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ మహిళా నేతలను ఎందుకు అడ్డుకున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
నేరాలు ఒక్క హైదరాబాద్‌కు పరిమితం కాలేదని.. రాష్ట్రమంతటా విస్తరించాయని భట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారులపై ఒత్తిడి కారణంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని భట్టి ఆరోపించారు. మంథనిలో హత్యకు గురైన వామనరావు కేసును (vaman rao lawyer) సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరామని.. కానీ ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని విక్రమార్క దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ (kcr) కుటుంబం నడుపుతోందని.. కల్వకుంట్ల కుటుంబం చెబితే తప్ప మంత్రులు సైతం స్పందించడం లేదని భట్టి చురకలు వేశారు.
ఏం జరిగింది?
మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ (Amnesia Pub)లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్‌కు వెళ్లింది. పబ్‌లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ కారు ఎక్కించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి ప్రాంతంలోని గల్లీల్లోకి తీసుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు.
ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. తనను కొందరు వేధించారని చెప్పడంతో 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. దీంతో రేప్ సెక్షన్లను నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు..
అయితే నిందితులను పట్టుకోవడంలో పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించారు. దీంతో ఈ కేసు చర్చనీయాంశమైంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ.. పబ్ దగ్గర బాలికను (Mionor girl) కారులో తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనలో హోంమంత్రి మనవడు ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhatti Vikramarka, Congress, Hyderabad, Trs