ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి హైకోర్టు (High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. సీఎం కేసీఆర్ (Cm Kcr) ఇచ్చిన ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకుంటాం అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ (Cm Kcr) సాక్ష్యాలుగా ఇచ్చిన పెన్ డ్రైవ్, ఇతర ఆధారాలు పరిశీలిస్తామని హైకోర్టు (High Court) తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరి రేపు కేసీఆర్ సాక్ష్యాలను పరిశిలించిన అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.
అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త కుట్రకు పూనుకున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ కేసు తెలంగాణ పోలీసులతో కూడిన స్పెషల్ టీం దర్యాప్తు జరుపుతుంది. ఈ ఘటన తరువాత కేసీఆర్ కొన్ని వీడియోలను, ఫోటోలను మీడియా ముందుంచారు. అలాగే ఆ సాక్ష్యాలను అన్ని రాష్ట్రాల హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు పంపించారు. ఈ క్రమంలో నేడు విచారణలో కేసీఆర్ సాక్ష్యాలపై వాదనలు జరగగా వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) సంచలన వీడియోలను మీడియాకు చూపించారు. ఆ వీడియోలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేసిన విషయాలు ఉన్నాయి. ఈ వీడియోలో BL సంతోష్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పేర్లు వినిపించాయి. కాగా ఈ వీడియోలో జరిగిన సంభాషణపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఇక ఎన్నికలు ఎందుకు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొడుతుంటే ఊరుకోవాలా. మేము అన్ని రకాలుగా సిద్ధంగా వున్నాం అని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చమని వీడియోలో చెబుతున్నారు. మరో నాలుగు ప్రభుత్వాలను పడగొడతామంటున్నారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఎక్కడివి అని కేసీఆర్ ప్రశ్నించారు. వీళ్లకు ఫేక్ ఐడి కార్డులు ఎలా వచ్చాయన్నారు. తమ ముఠాకు చెందిన 24 మంది సభ్యులు ఉన్నారని వాళ్లంతా చెప్పారని కేసీఆర్ అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని యువత, మేధావులు సహా అందరి మీద ఉందని అన్నారు.
ఇటీవల తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు వచ్చిన వ్యక్తులు మామూలు వాళ్లు కాదని.. వాళ్లకు సంబంధించిన వ్యవహారం గురించి తెలిస్తే తనకే ఆశ్చర్యం కలిగిందని అన్నారు. తమ ఎమ్మెల్యేలను కలిసిన వాళ్లు చెప్పిన విషయాలు వింటే షాక్ కలుగుతుందని అన్నారు. దేశంలో ఇప్పటికే తాము 8 ప్రభుత్వాలను కూలగొట్టామని ఈ వ్యక్తులు చెప్పారని.. మరికొన్ని ప్రభుత్వాలను పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇవన్నీ వీడియోల్లో ఉన్నాయని కేసీఆర్ (Cm Kcr) అన్నారు. మరి ఆ వీడియోలను పరిశీలించిన అనంతరం కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, High Court, Kcr, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case