తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు (Hyderabad Fire Accident) ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ దక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటన మరవకముందే నగరంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిక్కడపల్లి విఎస్టి (VST) సమీపంలో ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ప్రమాద దాటికి గోదాంలోని అన్ని వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదయం 5 గంటల ప్రాంతంలో గోడౌన్ లో అగ్నిప్రమాదం జరగగా మంటలు వేగంగా వ్యాపించాయి. గోడౌన్ లో డెకరేషన్ కు సంబంధించిన వస్తువులైన స్పాంజి, డెకరేషన్ క్లాత్స్, టెంట్, ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల ధాటికి దట్టమైన పొగ గోడౌన్ ను కమ్మేసింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు 2 ఫైరింజన్లతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటలు అదుపులోకి వచ్చినా కూడా దట్టమైన పొగ రావడంతో చుట్టు పక్కల ఇళ్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
తప్పిన పెను ప్రమాదం..
కాగా గోడౌన్ ఉన్న ప్రాంతంలో చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైగా ఈ గోడౌన్ రేకుల షెడ్ 2 అంతస్తుల్లో ఉండడంతో మంటలు చుట్టు పక్కలకు వ్యాపించలేదు. అలాగే ప్రమాద సమయంలో గోడౌన్ లో, చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మంటలు అదుపులోకి రావడంతో ప్రమాదం తప్పిందని అన్నారు.
ప్రమాదానికి కారణం ఏంటి?
కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలిసి రాలేదు. ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమా? లేక మరే ఇతర కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల దక్కన్ మాల్ లో జరిగిన ప్రమాదం మరువక ముందే మరో అగ్నిప్రమాదం జరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వస్తుందో అని నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Hyderabad, Telangana