Home /News /telangana /

HYDERABAD ANOTHER CYBER CRIME IN THE NAME OF AMERICAN DOLLAR HYDERABAD MEIN LOSS 16 LAKH RUPEES BY FRIEND FULL DETAILS HERE HSN

Hyderabad: స్నేహితుడికే కుచ్చుటోపీ.. ఫోన్లోనే కథలు చెప్పి ఏకంగా రూ.16 లక్షలు మోసం.. హైదరాబాద్ లో వెలుగులోకి మరో సైబర్ నేరం..!

అరెస్టయిన వంశీధర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

అరెస్టయిన వంశీధర్ రెడ్డి (ఫైల్ ఫొటో)

హైదరాబాద్ లో మరో సైబర్ నేరం జరిగింది. అమెరికన్ డాలర్ల పేరుతో లేని డబ్బులను ఉన్నట్టుగా సృష్టించి ఏకంగా 16 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

  పోలీసులు ఎన్ని విధాలుగా అప్రమత్తం చేసినా, స్టార్ హీరోలతో ప్రచారం చేయించినప్పటికీ సైబర్ నేరాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త తరహా నేరాలకు సైబర్ చోరులు ప్లాన్లు గీస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మనుషుల్లో ఉన్న ఆశనే ఆయుధంగా మలచుకుంటున్నారు. ఫోన్లలోనే కథంతా నడిపించేస్తున్నారు. లక్షలకు లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. పెద్ద చదువులు చదివి, ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారిని కూడా సైబర్ నేరగాళ్లు మోసపుచ్చగలుగుతున్నారంటే వాళ్లు చెప్పే మాటలు ఎలా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ లో మరో సైబర్ నేరం జరిగింది. లేని డబ్బులను ఉన్నట్టుగా సృష్టించి ఏకంగా 16 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. నిందితుల్లో ఒకరు అతడి స్నేహితుడే కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మేము ఇన్ స్టా గ్లోబర్ ప్లే‘ అనే ట్రేడింగ్ వెబ్ సైట్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే మేం చెప్పే విధంగా చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. మీకు తెలుసుగా రూపాయి రేటు ఎలా పడిపోతోందో. అమెరికన్ డాలర్ రేటు ఏ రేంజ్ లో ఉందో. రాబోయే రోజుల్లో డాలర్ దే హవా. మీరు ఇప్పుడు అమెరికన్ డాలర్లను తక్కువకు కొని ఆ తర్వాత అమ్ముకోవచ్చు. అప్పుడు డబ్బే డబ్బు. ఆలోచించుకోండి‘ అని ఆశ చూపాడు. దీంతో అతడు సరేననడంతో వివరాలు తీసుకుని నిందితుడు ఓ ఖాతాను ఓపెన్ చేశాడు. దానికి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లను బాధితుడికి పంపించాడు. 100 అమెరికా డాలర్లు క్రెడిట్ అయి ఉంటాయని, చూసుకోమని చెప్పాడు. బాధితుడు ఆన్ లైన్లో ఖాతాను పరిశీలించి నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత మూడు వేల రూపాయలను కమిషన్ గా చెల్లించాడు.

  గతేడాది జూన్ 26వ తారీఖున బాధితుడి స్నేహితుడే అయిన దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తితో ఫోన్ చేయించారు. ‘బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెడితే నాకు 50 వేల అమెరికన్ డాలర్లు అధికంగా వచ్చాయి. నాకు అందులో 40శాతం ఇస్తే చాలు. ఆ అమెరికన్ డాలర్లను నీ ఇన్ స్టా గ్లోబల్ ప్లే వ్యాలెట్ ఖాతాకు బదిలీ చేస్తా. ఆలోచించుకో‘ అన్నాడు. బాధితుడు తనకు అధికంగా లాభం వస్తుందని ఆశపడ్డాడు. మందుగా ఆ డాలర్లను తన ఖాతాలోకి పంపితే, ఆ తర్వాతే డబ్బు పంపిస్తానని షరతు పెట్టాడు. దీంతో వెంటనే ఆ సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాను పోలిన ఓ నకిలీ ఖాతాను సృష్టించి అతడి అకౌంట్లోకి 50 వేల డాలర్లు క్రెడిట్ అయినట్టుగా చూపించారు.

  దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను బాధితుడికి పంపించారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు వెంటనే వారికి 16 లక్షల రూపాయలను బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన వద్ద ఉన్న అమెరికన్ డాలర్లను అమ్మేసి సొమ్ము చేసుకోవాలని బాధితుడు యత్నించాడు. కానీ చివరకు మోసపోయానని గ్రహించాడు. దీంతో తనతో సంప్రదింపులు జరిపిన వాళ్లకు ఫోన్ చేయగా ఫలితం లేకుండా పోయింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు టెక్నికల్ అంశాల ఆధారంగా కేపీహెచ్ బీ కి చెందిన పీ.వంశీధర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న రెండు ఫోన్లు, వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్ కు తరలించారు. ఈ నేరంలో పాలు పంచుకున్న దేవరాజ్ రెడ్డి, ఎండీ సుభాణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Crime story, CYBER CRIME, Hyderabad

  తదుపరి వార్తలు