తెలంగాణలో పాలిటిక్స్ (Telangana Politics) వేడెక్కాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సీన్ టీఆర్ఎస్ (Trs) వర్సెస్ బీజేపీ (Bjp)గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని కమలం నాయకులు తహతహలాడుతున్నారు. అటు కేసీఆర్ బీజేపీపై యుద్ధం చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక బీజేపీ కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ..రాష్ట్రంలో ఈసారి కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రతో నిత్యం ప్రజల్లో ఉంటూ తెరాసపై, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇక కేసీఆర్ వరుస బహిరంగ సభలతో ప్రధాని మోడీపై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ (BL Santosh), బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్ (Sunil bunsal), తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ (Tarun chugh) తెలంగాణాకు రానున్నట్టు తెలుస్తుంది. ఈనెల 28న బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్ (Hyderabad) రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ అందులో భాగంగా 28,29 తేదీల్లో బీజేపీ నాయకులకి ఇక్కడే మకాం వేయనున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకులు మూకుమ్మడిగా తెలంగాణకు రావడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.
నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ..
గుజరాత్ లో గెలిచిన ఉత్సాహంతో బీజేపీ దూకుడు మీదుంది. అక్కడి ఫలితాలే తెలంగాణాలో పునరావృతం అవుతాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన కమలదళం మొదటి టార్గెట్ గా తెలంగాణ ఉన్నట్టు తెలుస్తుంది. ఈనెల 28,29 తేదీలలో దక్షిణాది పార్లమెంట్ నియోజకవర్గ పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం, అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.
సర్వత్రా ఉత్కంఠ..
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, లిక్కర్ స్కాంలో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక నిన్న TRS ను BRSగా ఆమోదిస్తూ ఈసీ కేసీఆర్ కు సమాచారం ఇచ్చింది. ఇలాంటి తరుణంలో అమిత్ షా, సంతోష్ రాకపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల బేరసారాల కేసులో కూడా అమిత్ షా, BL సంతోష్ పేర్లు వినిపించాయి. మరి దీనిపై స్పందిస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Hyderabad, Kcr, Telangana, Telangana News, Trs