జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా బీఆర్ఎస్(BRS) పార్టీ దూకుడు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఏపీ, ఒడిశా నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. కర్నాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్ తెలిపింది. త్వరలోనే మహారాష్ట్రలో కూడా బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సినీ నటుడు, సమతువా మక్కల్ కచ్చి పార్టీ నేత శరత్ కుమార్ (Sarath Kumar).. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత (MLC Kavitha)తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లక్ష్యాలు, అజెండాను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత.. ముందుగా తెలంగాణ చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోనూ బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాలోచనలు చేస్తున్నారు. తమతో కలిసి వచ్చే నేతలతో కలిసి తమిళనాడులోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు శరత్ కుమార్.. ఎమ్మెల్సీ కవితతో సమావేశమైనట్లు సమాచారం. ఐతే తమిళనాడులో సమతువా మక్కల్ కచ్చి పార్టీతో బీఆర్ఎస్ చేతులు కలుపుతుందా? లేదంటే శరత్ కుమార్ ఆయన పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కవిత, శరత్ కుమార్ ఏయే అంశాలపై చర్చించారన్న వివరాలు బయటకు రాలేదు. కానీ.. వీరిద్దరి భేటీ మాత్రం..ఇటు సినీ ఇండస్ట్రీ..అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, శుక్రవారం ఒడిశాకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆయన భార్య హేమ గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, నవనిర్మాణ్ కిసాన్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతు సంఘాల నేతలు తెలంగాణభవన్‌లో కేసీఆర్ సమక్షంలో శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు.
గురువారం ఛత్రపతి శివాజీ 13వ వారసుడు శంభాజీ రాజే కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌లో వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. దేశంలో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శంభాజీ రాజే ప్రశంసించారు. తెలంగాణ ప్రగతి నమూనా దేశవ్యాప్తంగా విస్తరించాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే నాందెడ్‌లో బీఆర్ఎస్ సభను నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఆ సభ వేదికగా శంభాజీ బీఆర్ఎస్‌లో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Kalvakuntla Kavitha, Local News, Sarathkumar, Telangana