కరోనా కారణంగా చాలామంది ఉపాధి కోల్పోయారు. మరి కొందరి వ్యాపారాలు తీవ్రంగా నష్టం రావడంతో రోడ్డున పడ్డారు. దీంతో కొత్త ఉద్యోగ వేటలో పడ్డారు. ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులు పలు జాబ్ సైట్లల్లో జాబ్ ల కోసం వెతుకుతున్నారు. ఇలా తమ బయోడేటాను పలు సైట్లల్లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ మహిళ జాబ్ సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకుంది. ఆమె ఫోన్ నంబర్ సంపాధించిన సైబర్ నేరగాళ్లు ఉద్యోగం వచ్చిందని నమ్మించి.. ప్రాసెసింగ్ ఫీజు అంటూ రూ. లక్షల్లో దండుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం పలు జాబ్ సైట్లలో దరఖాస్తు చేసుకుంది. దీన్ని అదునుగా భావించిన సైబర్ నిందితులు.. క్వికర్ డాట్.కామ్ నుంచి కాల్ చేస్తున్నామని ఫోన్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీకు జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. దానికి నెలకు జీతం రూ.30వేలు అంటూ చెప్పారు. ఈ జాబ్ మీకు రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు.
అందుకు గానూ బాధితురాలి నుంచి నిందితులు లక్ష రూపాయలకు పైగా తమ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అనంతరం నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో.. తాను మోసపోయానని బాధితురాలు గ్రహించి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, CYBER CRIME, CYBER FRAUD, Shamshabad Airport