Home /News /telangana /

HYDERABAD A COMPOUNDER WHO HAS BEEN WORKING AS A FAKE DOCTOR IN HOSPITALS IN HYDERABAD FOR YEARS PRV

OMG: వీడు మామూలోడు కాదు.. వైద్యుడిగా ఆస్పత్రిలో డ్యూటీ.. నిజస్వరూపం తెలిసి అంతా షాక్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లు ఇపుడు ఏకంగా నకిలీ డాక్టర్లే వచ్చేశారు. ఎంబీబీఎస్​ కూడా చదవకుండా ఆస్పత్రులతో దర్జాగా వైద్యులుగా చెలామనీ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్​లో జరిగింది.

  కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్లు చేస్తున్నారు కేటుగాళ్లు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లలాంటి దారుణాలు చూస్తూనే ఉన్నాం. ఇపుడు ఏకంగా నకిలీ డాక్టర్లే (Fake Doctors) వచ్చేశారు. ఎంబీబీఎస్ (MBBS)​ కూడా చదవకుండా ఆస్పత్రులతో దర్జాగా వైద్యులుగా చెలామనీ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్​ (Hyderabad)లో జరిగింది. నకిలీ డిగ్రీతో డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిని శుక్రవారం కర్మన్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పోలీసులు అరెస్టు చేశారు. గతంలో వివిధ ఆసుపత్రుల్లో కాంపౌండర్ గా, పీఆర్వోగా పనిచేసిన నిందితుడు తన పాస్ పోర్టుపై రష్యాకు చెందిన నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ (Immigration Stamp) ను పొందేందుకు కూడా ప్ర‌య‌త్నించాడు.  విశ్వసనీయ స‌మాచారం మేర‌కు ఎల్బీ నగర్ (LB Nagar)కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సిబ్బంది మీర్ పేట్ పోలీసుల‌తో క‌లిసి క‌ర్మ‌న్ ఘాట్ లోని ఆర్కే హాస్పిటల్ లో డాక్టర్ గా ప‌ని చేస్తున్న కె విజయ్ కుమార్ (36)ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అత‌డు నిజం ఒప్పుకున్నాడు. ఆయ‌న ఇచ్చిన స‌మాచారం తో మల్లేపల్లేకిల్లి చెందిన సిటి స్కాన్ టెక్నీషియన్ అఫ్రో జ్ ఖాన్, హబీబ్ నగర్ కు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ మహబూబ్ అలీ జునైద్ ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

  ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌ సంపాదించేసి..

  సూర్యాపేట (Suryapet) జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కుదిలెట్టి విజయ్‌కుమార్‌(36) 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా దూరవిద్యలో బీఎస్సీ (BSc) చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై కూడా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. పలు ఆస్పత్రుల్లో అతడు కాంపౌండర్‌/పీఆర్‌ఓగా పనిచేశాడు. ఆ అనుభవంతో డాక్టర్ల వద్ద అసిస్టెంట్‌గానూ పనిచేశాడు. ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌ సంపాదించేసి తనే డాక్టర్‌ అవతారమెత్తితే సులభంగా డబ్బు దండుకోవచ్చనుకున్నాడు.  ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా ఆరు నెలల పాటు నెలవారీ రూ.60,000 జీతంతో పనిచేశాడు విజయ్ . తదనంతరం కొన్ని నెలలు విరామం తీసుకున్న అత‌డు ఆరు నెలల కింద‌ట డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా రూ. 45,000 నెల జీతానికి ఆర్కే ఆసుపత్రిలో చేరాడు. విజయ్ ప్రధానంగా రాత్రిపూట రౌండ్లు నిర్వ‌హించేవాడ‌ని, ఇతర వైద్యుల స‌మక్షంలో చికిత్స పొందుతున్న రోగుల‌ను ప‌రీక్షించేవాడ‌ని పోలీసులు తెలిపారు.

  మిగతా నిందితుల‌కు రూ.6.5 లక్షలు చెల్లించి రష్యాలోని కజాన్ స్టేట్స్ మెడికల్ యూనివ‌ర్సిటీలో నకిలీ వైద్య పట్టా పొందినట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపార‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. హుజూర్ న‌గ‌ర్ కు చెందిన కుమార్ తో తనకు రెండేళ్ల క్రితం, దిల్ సుఖ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పీఆర్వో గా పనిచేస్తున్నప్పుడు అఫ్రోజ్ తో పరిచయం ఏర్పడిందని విజయ్ తెలిపారు. అలాగే అతడికి నకిలీ మెడికల్ డిగ్రీని అందించిన జునైద్ తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పాస్ పోర్టుపై నకిలీ రష్యన్ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ ఇస్తానని కూడా జునైద్ హామీ ఇచ్చాడని, కానీ ఇంకా అది జ‌ర‌గ‌లేద‌ని నిందితుడు తెలిపాడు. అయితే పోలీసులు జునైద్ వద్ద నుండి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

  నిందితులను కస్టడీలోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తామని, ఎవరైనా నకిలీ వైద్యుల సమాచారం ఇవ్వాలనుకుంటే 9490617111 వాట్సాప్‌ నెంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చని సీపీ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ మురళీధర్‌, ఏసీపీలు వెంకన్ననాయక్‌, పురుషోత్తంరెడ్డి, ఇన్‌స్పెక్టర్లు సుధాకర్‌, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Doctors, Fake id, Fraud, Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు