హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. నాలాలో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన న్యూబోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్లో చోటుచేసుకుంది. మృతిచెందిన బాలుడిని 7 ఏళ్ల ఆనంద్ సాయిగా గుర్తించారు. వివరాలు.. ఆనంద్‌నగర్ కల్వర్టు వద్ద ఉన్న నాలాకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్న ఆనంద్ సాయి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. బాలుడు నాలాలో పడటం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాలుడి ఆచూకీ కోసం ప్రయత్నించారు.
ఇక, ఘటనాస్థలానికి చేరుకున్న డిజాస్టర్ టీం.. బాలుడి కోసం మూడు గంటలు శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. అయితే బాలుడు నాలాలో పడిపోయిన చోటుకు కొద్ది దూరంలోనే అతడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబ భ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనతో ఆనంద్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. సరైన రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.