హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: దొంగకు చుక్కలు చూపించిన మహిళ.. అరకిలోమీటర్ వెంటాడి మరీ పట్టుకుంది..

Hyderabad: దొంగకు చుక్కలు చూపించిన మహిళ.. అరకిలోమీటర్ వెంటాడి మరీ పట్టుకుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: నడి వయసులో ఉన్నప్పటికీ.. నర్సమ్మ ఏ మాత్రం భయపడకుండా.. దొంగను వెంటాడి పట్టుకున్నందుకు.. స్థానికులు, పోలీసులు ఆమెను అభినందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎందుకంటే.. మన చుట్టూ ఉండే వారిలో.. ఎవరు మంచోళ్లో.. ఎవరు దొంగలో తెలియదు. మన జాగ్రత్తలో మనం  ఉండాలి.  ముఖ్యంగా బ్యాంకులకు వెళ్లేవారు.. డబ్బు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.  ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా... రెప్పపాటులో మన కళ్ల ముందే మన డబ్బును ఎత్తుకెళ్లే దొంగలుంటారు.  హైదరాబాద్ శివారులో కూడా ఓ దోపిడీ దొంగ ఇలాగే రెచ్చిపోయాడు. డబ్బు సంచితో బ్యాంకుకు వెళ్తున్న మహిళపై దాడిచేసి.. బ్యాగ్‌ను ఎత్తుకెళ్లాడు. ఐతే దొంగను చూసి.. ఆమె భయపడలేదు. ధైర్యంగా ఎదుర్కొంది. అతడి వెనకాల పరుగెత్తింది. అరకిలోటర్ వెంటాడి మరీ పట్టుకుంది.  అనంతరం స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించింది. ఘట్‌కేసర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...  ఏదులాబాద్‌కు చెందిన 55 ఏళ్ల నర్సమ్మ మహిళా పొదుపు సంఘం నాయకురాలిగా వ్యవహరిస్తోంది. సభ్యుల నుంచి డబ్బు సేకరించిన తర్వాత.. దానిని బ్యాంక్‌కు వెళ్లి జమ చేస్తుంది. గురువారం కూడా గ్రూప్ సభ్యుల నుంచి రూ.50వేలు వసూలు చేసి... ఆ మొత్తాన్ని ఘట్‌కేసర్‌లోని యూనియన్ బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్లింది. నర్సమ్మ చేతిలో డబ్బులు ఉన్నట్టు గమనించిన ఓ యువకుడు... ఆమెను ఫాలో అయ్యాడు. అదును చూసి.. ఆమె చేతిలోని బ్యాగ్‌ను లాక్కొని పారిపోయాడు. వెంటనే తేరుకున్న నర్సమ్మ.. గట్టిగా కేకలు వేస్తూ.. అతడి వెనకాలే పరుగెత్తింది.  రోడ్డుపై కేకలు వేస్తూ.. అర కిలో మీటర్ వరకు వెంటాడింది.  ఎట్టకేలకు దొంగను పట్టుకొని.. తన డబ్బు సంచి తాను లాక్కుంది. జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో.. వారు ఆ యువకుడిపై దాడి చేశారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నడి వయసులో ఉన్నప్పటికీ.. నర్సమ్మ ఏ మాత్రం భయపడకుండా.. దొంగను వెంటాడి పట్టుకున్నందుకు.. స్థానికులు, పోలీసులు ఆమెను అభినందించారు. దొంగతనాలను జరిగినప్పుడు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా.. నర్సమ్మలా ఎదుర్కోవాలని చెప్పారు. డబ్బు దొంగతనం చేసిన యువకుడు తమ అదుపులో ఉన్నట్లు సీఎం జంగయ్య తెలిపారు. అతడిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలను సేకరించిన తర్వాత.. కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు