Hyderabad: గాంధీ ఆస్పత్రిలో కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు.. నిజంగా అద్భుతం

గాంధీ ఆస్పత్రి

తెలంగాణలో బుధవారం 4723 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 5,695 కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ బారినపడి నేడు 31 మంది మరణించారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి రోజు 4వేల మందికి పైగా మరణిస్తున్నారు. ఇందులో యువకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. సెకండ్ వేవ్‌లో పెద్ద మొత్తంలో యువకులు చనిపోతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో 110 ఏళ్ల వృద్ధుడు మాత్రం కరోనా మహమ్మారిను జయించారు. అవును.. తెలంగాణ కోవిడ్ ఆస్పత్రి గాంధీలో అద్భుతం జరిగింది. దేశంలోనే అత్యధిక వయసున్న కరోనా బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్నారు. రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.

    రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆయన ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరే సమయంలో రామానంద తీర్థ ఆక్సిజన్ లెవెల్స్ 92 పాయింట్లుగా ఉంది. అప్పటి నుంచీ ఆయనకు ఐసీయూ వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. ఐతే దాదాపు మూడు వారాల చికిత్స తర్వాత రామానంద కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో బుధవారం ఆయనకు మరోసారి కరోనా పరీక్ష చేశారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చింది. రామానంద తీర్థుకు ఎలాంటి ఇతర జబ్బులు లేకపోవడం వల్లే ఇది సాధ్యమైందని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపారు. ఆయనను సాధారణ వార్డుకు మారుస్తామని.. పూర్తిగా కోలుకునే వరకు గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు.

    కాగా, తెలంగాణలో బుధవారం 4723 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 5,695 కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ బారినపడి నేడు 31 మంది మరణించారని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711కి చేరాయి. కరోనాకు 2,834 మంది బలయ్యారు. ఇప్పటి వరకు 4,49,744 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 69,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నేడు గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 745 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మే 12 నుంచి మే 21 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ 10 రోజుల పాటు నిత్యం 4 గంటలు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అమలు ఉంటుంది. ఉదయం 10 తర్వాత అన్ని మూసివేయాల్సి ఉంటుంది. రోజుకు 20 గంటల పాటు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: