Eetala Rajender: అలా చెయ్యలేదో దీక్షకు కూర్చుంటా.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ (ఫైల్)

Dalitha Bandhu in Huzurabad: బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టించి.. కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో అర్హులైన ప్రతి కుటుంబానికీ దళిత బంధు కింద డబ్బులు ఇస్తామని స్పష్టం చేశారు.

  • Share this:
    దళిత బంధు పథకంతో పాటు ఉపఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ అంతా హుజురాబాద్ వైపే చూస్తోంది. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఐతే కొందరిని మాత్రమే దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేశారని.. హుజురాబాద్‌లో రెండు రోజులుగా దళిత సామాజికవర్గానికి చెందిన వారు ఆందోళనలు చేస్తున్నారు. అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత బంధుపై ఈటల రాజేందర్ కూడా తాజాగా మరోసారి స్పందించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమండ్ చేశారు. అందరికీ ఇవ్వకుంటే దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

    ''దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం లోనున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలి. 10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలి. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలి. దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదు. అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే దీక్షకు కూర్చుంటానని హెచ్చరిస్తున్నా.'' ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

    మరోవైపు బీజేపీ తీరుపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల్లో లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టించి.. కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లో అర్హులైన ప్రతి కుటుంబానికీ దళిత బంధు కింద డబ్బులు ఇస్తామని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల కోసమే వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. చెప్పుడు మాటలు వినవద్దని సూచించారు.

    ''రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు, అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. పథకాలపై అపోహలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికలు లేకున్నా మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారు. ఇదే హుజురాబాద్‌లో రైతు బంధు ప్రారంభిస్తే ఒప్పు, ఇప్పుడు దళిత బంధు తప్పెలా అవుతుంది. తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ఇక్కడ నిరసలను చేపిస్తూ.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే మరో 10 లక్షలు కేంద్రం నుంచి తెచ్చి ఇవ్వండి. కాకుంటే 20 లక్షలు ఇవ్వండి. బండి సంజయ్ చెప్పినట్లుగా మరో 40 లక్షలు అదనంగా తెచ్చిస్తే మీకు, మోడీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. రాష్ట్రంలోని ప్రజలకు 50 లక్షలు వస్తే మేమెంతో సంతోషిస్తాం.'' అని హరీష్ రావు విమర్శించారు.

    ఆగస్టు 16న శాలపల్లి గ్రామంలో జరగనున్న సభలో వారికి సీఎం కేసీఆర్ స్వయంగా వారికి దళిత బంధు చెక్కులను అందజేయనున్నారు. ఐతే అర్హులైన వారికి కాకుండా టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాలనే లబ్ధి దారులుగా ఎంపిక చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు దళిత కుటుంబాలు రెండు రోజులుగా హుజూరాబాద్‌లో ఆందోళన చేస్తున్నాయి. దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు సాయం అందుతుందని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: