Huzurabad Bypolls: చలో హుజూరాబాద్.. రెండు బహిరంగ సభలకు సీఎం కేసీఆర్ ప్లాన్.. ఎప్పుడంటే..

సీఎం కేసీఆర్

Huzurabad ByPolls 2021: ఆగస్టు 2వ వారంలో హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామం లేదా పట్టణాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

  • Share this:
    హుజూరాబాద్‌ ఉపఎన్నికల పోరు తెలంగాణ రాజకీయాను వేడెక్కిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. అన్ని పథకాలు, కార్యక్రమాలు హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సీఎం కేసీఆర్ అక్కడ పర్యటించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో రెండు భారీ బహిరంగస సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముహూర్తాలను కూడా ఖరారుచేసినట్లు సమాచారం. మొదట దళిత బంధు సభను.. ఆ తర్వాత హుజూరాబాద్ ఉపఎన్నిక సభను నిర్వహించనున్నారు.

    ఆగస్టు 2వ వారంలో హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం గ్రామం లేదా పట్టణాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో రైతు బంధు పథకాన్ని కూడా ఇదే నియోజకవర్గంలోని శాలపల్లిలో ప్రారంభించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హుజూరాబాద్‌లోనే దళిత బంధును ప్రారంభిస్తున్నారు. దానికి తోడు ఉపఎన్నికలు కూడా ఉండడంతో దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. పాదయాత్రగా ప్రతి గ్రామాన్ని పర్యటిస్తున్నారు. ఐతే నిన్న ఆయన అస్వస్థతకు గురవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈటల రాజేందర్ భార్య జమున కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

    మరోవైపు హుజూరాబాద్ ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అక్కడి నుంచే ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. గొర్రెల పంపిణీ ప్రక్రియను కూడా ఇక్కడే ప్రారంభించారు. వీటికి తోడు పలు సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేవారు. ఇక ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌ను నియమించారు. ఓటర్లు ఈటల వైపుకు మళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకు రకరకాల స్కీమ్‌ను అమలు చేస్తున్నారు.

    ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ టెన్షన్ పట్టుకుందని.. ఓడిపోతామన్న భయంతోనే అక్కడ వేల కోట్ల కుమ్మరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం తన పని తాను చేసుకుంటూపోతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: