హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad bypoll date: అక్టోబర్ చివరి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక..? లాజిక్ ఇదే..

Huzurabad bypoll date: అక్టోబర్ చివరి వారంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక..? లాజిక్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోంది. 

  హుజూరాబాద్ ఉప ఎన్నికపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేంద్ర ఎన్నిక సంఘం.. కోవిడ్ నేపథ్యంలో సాధారణ, ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి అభిప్రాయాలను కోరుతూ వివిధ రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. ఆగస్టు 30 లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. కొద్ది నెలల కిందట కరోనా సమయంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై విమర్శలు వచ్చాయి. మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో ఎన్నికల నిర్వాహణపై గతంలో ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు.

  దీంతో హుజూరాబాద్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈసీ తాజా నిర్ణయం నేపథ్యంలో ఆగస్టు 30 వరకు ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు ఉండబోవని విషయం స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలతోపాటు, పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను ఎప్పుడు నిర్వహించనున్నారనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ విశ్లేషకులు అక్టోబర్ చివరి వారంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు వారు బలమైన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు.

  ఇండియాలో ఆగస్టులో కరోనా థర్డ్‌వేవ్  విజృంభిస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది కాస్తా సెప్టెంబర్ నాటికి తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఆ తర్వాత ఈసీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఆగస్టు 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంది. అయితే వీటిపై సమీక్షించేందుకు ఈసీ కొంత సమయం తీసుకుంటుందని.. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందనే లాజిక్‌‌ను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.

  సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు, పోలింగ్ తేదీకి 45 రోజుల గ్యాప్ ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఒకవేళ సెప్టెంబర్ రెండో వారంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన.. ఆక్టోబర్ చివరి వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న మృతి చెందారు. అయితే సాధారణంగా ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ 28లోపు అక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడితే.. బద్వేల్ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోపే ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనట్టు అవుతుంది.

  సైలెంట్‌గా బీజేపీ..

  హుజూరాబాద్ నియోజవర్గంలో ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య ప్రధానంగా పోటీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో.. విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలతో హడావిడి చేస్తున్నారు. అలాగే మంత్రులు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులు ఇంత దూకుడుగా వ్యహరిస్తుంటే.. బీజేపీ నేతల హడావిడి మాత్రం చెప్పుకోదగిన విధంగా లేదని అంటున్నారు. ఒక ఈటల రాజేందర్, ఆయన సతీమణి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం హుజూరాబాద్‌ వైపు చూడటం లేదు. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉందనే వాదన వినిపిస్తుంది. ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదనే సమాచారం బీజేపీ నేతలకు ఉందని.. అందుకనే వారు హుజురాబాద్‌పై అంతగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే సమయానికి వారు పెద్ద ఎత్తున ప్రచారం చేపడతారనే టాక్ వినిపిస్తోంది.

  మమతా బెనర్జీకి కీలకంగా ఉప ఎన్నికలు..

  మరోవైపు ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్‌లో కూడా కొన్ని స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. భవానీపూర్‌ నుంచి టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయారు. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. ఇలా ఆమె ఆరు నెలల వరకే సీఎంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరు నెలల్లోపే అసెంబ్లీ‌లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కూడా సీఎం కొనసాగాలని ఆమె భావిస్తున్నారు.

  ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని టీఎంసీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు టీఎంసీ ప్రతినిధుల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసింది. ఉప ఎన్నికలు నిర్వహించాలని కోరింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు జరపవచ్చని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రస్తుతం బెంగాల్‌లో 6 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం చూస్తే నవంబర్ మొదటి వారంలోపే బెంగాల్‌లో కూడా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఈసీ అక్టోబర్ చివరి వారంలోనే ఉప ఎన్నికల నిర్వహించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Election Commission of India, Huzurabad By-election 2021, Telangana News, West Bengal

  ఉత్తమ కథలు