Huzurabad bypoll: హుజూరాబాద్‌లో ఈటలదే విజయం.. కాంగ్రెస్ ఎంపీ సంచలన సర్వే

ఈటల రాజేందర్

Huzurabad By elections 2021: ఈటల రాజేందర్‌కు 67శాతం ఓట్లు ఈటల రాజేందర్‌కు పడతాయని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌కు 30 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి 5 శాతం లోపు మాత్రమే ఓట్లు పడే అవకాశముందని ఆయన తెలిపారు

 • Share this:
  తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికల రాజకీయాలు రోజు రోజు వేడెక్కుతున్నాయి. నేతల ప్రచారం.. ప్రభుత్వ పథకాలు.. పక్కపార్టీల్లోకి వలసలతో.. ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల వేటలో ఉండగా.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పాదయాత్రగా ప్రతి గ్రామానికీ వెళ్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించానని.. ఈటల రాజేందర్‌కు 67శాతం ఓట్లు ఈటల రాజేందర్‌కు పడతాయని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌కు 30 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి 5 శాతం లోపు మాత్రమే ఓట్లు పడే అవకాశముందని ఆయన తెలిపారు. ఐతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం, ఇతర కార్యక్రమాలను వేగవంతం చేస్తే మార్పు వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. ఆ వ్యతిరేకక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

  ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ కోమటిరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లలో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు కోమటిరెడ్ది వెంకటరెడ్డి. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే భయంతోనే నల్గొండ జిల్లాలో తమ హయాంలో ప్రారంభించిన ఎస్సెల్బీసీ టన్నెల్‌, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడమే ప్రస్తుతం తన లక్ష్యమని ఆయన అన్నారు.

  తెలంగాణలో పాలన మొత్తం మంత్రి కేటీఆర్‌ మిత్రుడు తేజ రాజు చేతిలో ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తేజ రాజు ఎవరో కాదని.. ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడని ఆన చెప్పారు.


  కాగా, మరోవైపు హుజూరాబాద్ ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ అక్కడి నుంచే ప్రారంభించారు. దళిత బంధు పథకాన్ని కూడా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. గొర్రెల పంపిణీ ప్రక్రియను కూడా ఇక్కడే ప్రారంభించారు. వీటికి తోడు పలు సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ అభివృద్ధికి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేవారు. ఇక ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌ను నియమించారు. ఓటర్లు ఈటల వైపుకు మళ్లకుండా తమ వైపు ఆకర్షించేందుకు రకరకాల స్కీమ్‌ను అమలు చేస్తున్నారు.

  ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ టెన్షన్ పట్టుకుందని.. ఓడిపోతామన్న భయంతోనే అక్కడ వేల కోట్ల కుమ్మరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: