హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఈటల ప్రధాన అనుచరుడు, కరీంనగర్ కేడీసీసీ బ్యాంక్ వైస్ ఛైర్మన్ పింగిలి రమేష్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. హిందూత్వ భావజాలం కలిగిన బీజేపీలో ఇమడలేక.. పార్టీని వీడుతున్నట్లు పింగిలి రమేష్ తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగున్నాయని... టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే గులాబీ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. అందరిని కలుపుకుని టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని చెప్పారు పింగిలి రమేష్. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు అద్భుతమైన పథకమని ఆయన కొనియాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో సామాన్యులకు సముచిత స్థానం కల్పించిన ఘనత కూడా కేసీఆర్‌దే అన్నారు. త్వరలో హంగులు ఆర్భాటాలు లేకుండా టీఆర్ఎస్లో చేరతానని.. త్వరలో తేదీని కూడా ప్రకటిస్తానని వెల్లడించారు. ఆయనతో పాటు చుక్కా రంజిత్ కూడా కమలం పార్టీని వీడారు.
మరోవైపు ఈటల రాజేందర్ మాత్రం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రతీ గ్రామాన్ని తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ర్యాలీలు, సభలు, సమావేశాలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో వరాల జల్లు కురిపిస్తోంది. అభివృద్ధి పేరిట భారీ మొత్తంలో నిధులను ఖర్చు చేస్తోంది. దళిత బంధు పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు.
గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. ఈటల ఎత్తులను చిత్తు చేసేందుకు గులాబీ నేతలు ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తున్నారు. పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. కొండా సురేఖ పేరును హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసిందని.. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిల కూడా హుజురాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయదని ఇది వరకే స్పష్టం చేసినప్పటికీ.. నిరుద్యోగులు పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
కాగా, భూకబ్జా ఆరోపణ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. కాషాయ తీర్థం పుచ్చుకున్న వెంటనే నియోజకవర్గంలో అడుగుపెట్టి.. ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన సతీమణి జమున కూడా భర్తకు తోడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఎన్నికల్లో జమున పోటీచేస్తారా? లేదంటే ఈటలనే బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికకు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నది తెలియాల్సి ఉంది. అక్టోబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
YS sharmila : జగనన్నకు రాఖీ కట్టని వైఎస్ షర్మిల. ట్విట్టర్లో శుభాకాంక్షలు.
mp arvind :ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు... రేవంత్ రెడ్డి, సీఎం కేసిఆర్‌కు రెండో కొడుకు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Eetala rajender, Huzurabad, Huzurabad By-election 2021, Telangana, Trs