- పి.శ్రీనివాస్, కరీంనగర్, న్యూస్ 18
హుజూరాబాద్ (Huzurabad)లో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. నియోజకవర్గంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్ (TRS) వర్సెస్ బీజేపీ (BJP) గా మారడంతో విజయం కోసం ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో ప్రజలు కూడా ఈ ప్రచార హోరుతో విసిగిపోతున్నారు. కొందరు బాహాటంగా మేము ఈ పార్టీకే ఓటు వేస్తాం అంటు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో హుజురాబాద్‌లోని పలుచోట్ల వెలుస్తున్న బోర్డులు ఇప్పుడు ముఖ్యంగా బీజేపీకి తలనొప్పిగా మారుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad by-Elections) సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని పలుచోట్ల ప్రజలు బోర్డులు పెడుతున్నారు.
ఇంటిముందు ఫ్లెక్సీలు..
హుజూరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినా బీజేపీ అభ్యర్థులకు ఓ ఫ్లెక్సీ షాక్ ఇచ్చింది. ఆ ఫ్లెక్సీలో ఇలా రాసి ఉంది. వంట నూనె, గ్యాస్ ధర, పెట్రోల్ ధరలు పెంచిన నేపథ్యంలో..మా ఇంటి ఓట్లు అడగడానికి బిజెపి పార్టీ వాళ్ళు ఓట్లు అడగడానికి రావొద్దు. ఆసరా పింఛన్లు (Asara Pensions), కళ్యాణ లక్ష్మి (Kalayan Lakshimi), రైతు రుణమాఫీ,ఇస్తున్న టిఆర్ఎస్ పార్టీకె మా ఓట్లన్నీ అంటూ ఇలా ప్లెక్సీలు ఇంటి గేటు ముందు పేడుతున్నారు. ఇది చూసిన బీజేపీ అభ్యర్థులు షాక్ కు గురవుతున్నారు.
సోషల్ పోరు..
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఒకరిపైన ఒకరు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి, తమకు అనుగుణంగా ప్రచారాన్ని మలుచుకుంటున్నారు. ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఒకరిపైన ఒకరుమాటల యుద్ధం అయితే కొనసాగిస్తున్నారు. మొన్న ఎంగిలిపూల బతుకమ్మ రోజు కూడా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారని టీఆరెఎస్ వాళ్లు గ్యాస్ సిలిండర్ల (GAs Cylinders) ను పెట్టి బతుకమ్మ ఆడిన వైనం సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయింది. అలాగే బీజేపీ వాళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం నిధులు,నీళ్లు, నియామకం విషయంలో, డబల్ బెడ్ రూమ్ల విషయంలో విఫలమైందని, కెసిఆర్ మాటాలన్ని అబద్ధాల మాటలని డీజే పాటలు పెట్టి బతుకమ్మ ఆడిన విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
పెరిగిన చికెన్ ధర..
ఉప ఎన్నకల పుణ్యమా అని కోడి ధరకు రెక్కలు వచ్చాయి. ప్రచారానికి వచ్చిన ప్రతీ ఒక్కరు చికెన్ బిర్యాని (Chiken Biryani) కావాలంటూ డిమాండ్ చేస్తుండడంతో నేతలు అదే అందిస్తున్నారు. దీంతో చికెన్ ధర భారీగా పెరిగిపోతుంది. ప్రస్తుతం కిలో చికెన్ రూ.240 పలుకుతోంది. స్థానికంగా బిర్యానీ, కోడికూరలకు ప్రసిద్ధి చెందిన హోటళ్లు, రెస్టారెంట్లలోనూ చికెన్‌కు డిమాండ్ పెరిగింది. కరోనా కారణంగా బాగా నష్టాల్లో ఉన్న స్థానిక ట్రావెల్స్ యజమానులు ఉప ఎన్నిక కారణంగా బిజీ అయిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, Elections, Huzurabad By-election 2021, Telangana, Telangana bjp, Trs