HUZURABAD BY ELECTION 2021 IS AMONG THE MOST EXPENSIVE ELECTION IN INDIA KNR EVK
Huzurabad by-Election 2021 : వామ్మో.. ఇన్ని పైసలా.. ఎన్నికల వేళ హుజూరాబాద్‌కు నిధుల వరద
ప్రతీకాత్మక చిత్రం
Huzurabad by-Election 2021 :ఎన్నికలంటేనే ఖర్చు.. ఇక ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలు మంచి నీళ్లలాగా డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో ప్రభుత్వం ఏకంగా దాదాపు రూ .4 వేల కోట్ల వరకూ ఖర్చు పెడుతోంది. ఆగిన అన్ని పథకాలకు తిరిగా ప్రారంభించింది. కులాల వారీగా ప్రత్యేక లబ్ది చేకూర్చడం..రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో నియోజకవర్గంల అభివృద్ధి పరుగులు పెడుతోంది.
- పి.శ్రీనివాస్, కరీంనగర్, న్యూస్ 18
ఎన్నికలంటేనే ఖర్చు.. ఇక ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలు మంచి నీళ్లలాగా డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి. గత మూడు నెలలో హుజూరాబాద్ (Huzurabad)లో ఎంతెంత ఖర్చు చేస్తున్నాయో అంచనా వేయడం కష్టం. కానీ కోట్లలోనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా హుజూరాబాద్‌లో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ తన శక్తియుక్తులను మొత్తం అక్కడ కేంద్రీకరించింది. ఫలితంగా ప్రజల పంట పండింది. పథకాల వరద పారుతోంది. అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల కోసమే ఇవన్నీ చేస్తున్నారని బహిరంగ రహస్యం. ఇలాంటి ఖర్చు హుజూరాబాద్‌లో ప్రభుత్వం ఏకంగా దాదాపు రూ .4 వేల కోట్ల వరకూ ఖర్చు పెడుతోంది. దాదాపు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు మట్టి రోడ్లే సరిగ్గా ఉండని చోట సిమెంట్ రోడ్లు వచ్చేశాయి.
రాజీనామాతో మొదలు..
ఎప్పుడైతే ఈటల రాజేందర్ (Etela Rajender) రాజీనామా చేశారో అప్పుట్నుంచి హుజురాబాద్‌లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి . ప్రకటనలు మాత్రమే కాదు టెండర్ల పనులు అన్నీ చకచకా పూర్తయిపోయాయి . సీసీ రోడ్లు , డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ . 220 కోట్లు ఖర్చు చేస్తున్నారు . హుజురాబాద్ మున్సిపాలిటికి రూ .35 కోట్లు , జమ్మికుంట మున్సిపాలిటీకి రూ .30 కోట్లు వరకూ విడుదల చేశారు . ఇక స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్‌లకు దాదాపుగా రూ . రెండు వందల కోట్లను విడుదల చేశారు . మొత్తంగా ఇప్పటి వరకు రూ . 410 కోట్లు అభివృద్ధి పనుల కోసం మంజూరు కాగా .. పరిపాలనా అనుమతులు జారీ చేసినవి మరో రూ .190 కోట్లు ఉన్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి .
23 వేల మందికి దళితబంధు..
ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ ఓటర్లే (సుమారు 45 వేల మంది ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వం గతంలోనే గుర్తించిందని, హుజూరాబాద్ ఎన్నికలో దళితుల ఓట్లే కీలకం కావడంతో దళిత బంధు స్కీంను తీసుకొచ్చిందనే ప్రచారం జరిగింది. తొలుత నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే ఈ స్కీం వర్తింపజేస్తామని ప్రకటించినప్పటికీ హుజూరాబాద్ లో 23 వేల మందిని అర్హులుగా గుర్తించింది. ఇప్పటికే 17 వేల మంది ఖాతాల్లో రూ. 10 లక్షలు జమ చేసి, డబ్బులను ఫ్రీజింగ్ లో పెట్టింది. నాలుగు దఫాలుగా రూ .2,200 కోట్లు విడుదల చేసింది.
ఆసరాకు మోక్షం..
కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు . మూడేండ్లలో 57 ఏండ్లు నిండినోళ్లు , వితంతువులు , సదరం సర్టిఫికేట్ పొందిన దివ్యాంగులు , ఒంటరి మహిళలు , బీడీ , చేనేత , గీత కార్మికులు కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూశారు . ఇలాంటి అర్హులు రాష్ట్రంలో 15 లక్షల మంది వరకు ఉంటారని అంచనా . అయితే , 57 ఏండ్లు దాటినోళ్లంతా పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . దీంతో 9.50 లక్షల మంది మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్నారు . ప్రభుత్వం మాత్రం కొత్త పెన్షన్లు 3 నెలలుగా హుజూరాబాద్ ? లోనే పంపిణీ చేస్తోంది . ఇక్కడ కొత్తగా 10 వేల మందికి ఇస్తోంది . మూడేండ్లు మంజూరు కాని కొత్త పెన్షన్లు ఉపఎన్నిక సమయంలోనే మంజూరయ్యాయి .
ఆడబిడ్డలకు మిత్తి పైసలు విడుదల..
డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు తాము తీసుకున్న వడ్డీ లేని రుణాల (వీఎస్ఆర్ ) ను నెలనెలా అసలు , వడ్డీతో కలిపి కిస్తీని బ్యాంకుల్లో చెల్లిస్తున్నారు. వారు చెల్లించిన వడ్డీని మూడు నెలలకోసారి ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మూడేండ్లుగా ఈ మిత్తి పైసలు మహిళా గ్రూపులకు జమ కావడం లేదు . సుమారు రూ.3 వేల కోట్లు మహిళా సంఘాలకు సర్కార్ బాకీ పడింది. మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో ఈ బడ్జెట్ లో రూ. 3 వేల కోట్లు కేటాయించి కేవలం రూ .200 కోట్లు విడుదల చేసింది. అందులోనూ రూ .120 కోట్లను హుజూరాబాద్ లోని మహిళల ఖాతాల్లోనే జమ చేసింది . ఇన్నేండ్లుగా రాని పైసలు బై ఎలక్షన్ టైంలో వచ్చాయి.
రోడ్లకు మహర్దశ..
హుజూరాబాద్ లో కొత్త రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జోరుగా సాగుతోంది. గల్లీల్లో సీసీ రోడ్లు నిర్మించి, మెయిన్ బజార్లలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రూ.30 కోట్ల చొప్పున ఐదు మండలాలకు కలిపి రూ.150 కోట్లు కేటాయించారు. మొత్తంగా నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లకు రూ. 220 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
కుల సంఘాలకు స్థలాలు, భవనాలు..
దళితబంధుతో దళితులకే ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని, తమను పట్టించుకోవడం లేదని మిగతా సెక్షన్ల ప్రజలు భావిస్తున్నారని సర్వేల్లో వెళ్లడవుతుండడంతో ఇతర కులాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రులు హరీశ్ రావు, గంగుల, శ్రీనివాస్ గౌడ్ ఆత్మ గౌరవ సభలు పెట్టి ఆయా కుల సంఘాలకు స్థలాలు, భవనాలు మంజూరు చేశారు సొంత నియోజక వర్గాలను వదిలి తమ సొంత నియోజకవర్గాలకు కనీసం రూ.100 కోట్ల పనులు తీసుకురాలేని ఎమ్మెల్యేలు.. హుజూరాబాద్‌లో మాత్రం వేలాది కోట్లాది రూపాయల పనులు చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమను గెలిపించిన ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కొత్త ఆసరా పెన్షన్, రెండో విడత గొర్రెలు, దళితులకు మూడెకరాల భూమి , దళిత బంధు సాయం తదితర సంక్షేమ పథకాలు ఇప్పించలేని ఎమ్మెల్యేలు .. హుజూరాబాద్ లో మాత్రం తమ చేతుల మీదుగానే ఇవన్నీ ఇప్పిస్తున్నారు .
అనధికారిక ఖర్చుకు లెక్కే లేదు..
ఇక రాజకీయ పార్టీలు ఓటర్లకు పెట్టే ఖర్చు అదనం. ప్రభుత్వ స్కీములతో పాటు ఎలాగూ ఎన్నికలు ముగిసే వరకూ ఓటర్లకు ప్రత్యేకమైన మర్యాదలు చేస్తూనే ఉంటారు. ఇక ఓటింగ్‌కు ముందు పరిస్థితిని బట్టి నోట్ల వరద పారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .. ఎలా చూసినా ప్రభుత్వమే ఎన్నికల వ్యూహంతో రూ. మూడున్నర వేల కోట్ల వరకూ వెచ్చిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు ఎంత వెచ్చిస్తాయో అంచనా వేయడం కష్టం . ఈటల రాజీనామా తర్వాత సర్కారు ప్రకటించిన స్కీం దళిత బంధు . దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ఎన్నికల హామీ నెరవేరకపోవడం .. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు టీఆర్ఎస్ కు పడవనే భయంతోనే ఈ స్కీంను సీఎం కేసీఆర్ తెరపైకి తెచ్చారనే వాదన వినిపించింది .
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.