ప్రతిష్టాత్మక హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించిన రోజే మీడియా సాక్షిగా తాను చెప్పిన మాటలను ఆచరణలోకి తెచ్చారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఏవైతే పథకాలను ఆయుధాలుగా వాడుకున్నారో వాటినే తిరిగి అధికారపక్షంపై ప్రయోగిస్తూ ఈటల తన గేమ్ స్టార్ట్ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఈటల.. కేసీఆర్ దొంగ స్కీముల చిట్టాను బయటపెడుతూనే, వాటి అమలు నుంచి తప్పించుకుపోరాదని హెచ్చరిస్తూ, కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ఇదిలా ఉంటే, సుదీర్ఘ ఉద్యమ నేపథ్యమున్న ఈటల ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ పాత నైజాన్ని వదులుకోలేదనడానికి సంకేతంగా, కాషాయ నేతలకు భిన్నమైన తీరును ఇవాళ ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే..
కేసీఆర్ దొంగ స్కీంలు..
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే సీఎం కేసీఆర్ దొంగ స్కీంలు తీసుకొచ్చాడని, నవంబర్ 4 నుంచి దళిత బంధు పథకాన్ని తిరిగి అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు వట్టి డొల్లే అని తేలిపోయిందని, అయితే, తన నోటి నుంచి ప్రకటించిన ప్రతి పథకాన్ని కచ్చితంగా అమలు చేయించేలా కేసీఆర్ పై ఒత్తిడి పెంచుతామని ఈటల చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా..
గిరిజన బంధుకు డిమాండ్
హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ హడావుడిగా ప్రారంభించిన దళిత బంధు పథకం ఈసీ ఆంక్షల వల్ల నిలిచిపోవడం, అందుకు బీజేపీని తప్పు పడుతూ నవంబర్ 3 తర్వాత ఆ పథకాన్ని ఎవడు ఆపుతాడో చూస్తానని సీఎం కేసీఆర్ సవాలు చేసిన నేపథ్యాన్ని గుర్తుచేస్తూ ఈటల రాజేందర్ కొత్త డిమాండ్లను లేవనెత్తారు. దళితబంధు మాదిరి గిరిజన బంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్లల్లో కేసీఆర్ మట్టికొట్టారని మండిపడ్డారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములనూ కేసీఆర్ సర్కారు లాక్కొంటున్నదని ఆగ్రహించారు. గిరిజనులకు రిజర్వేషన్లు, గిరిజన విద్యార్థులకు పాత బకాయిలు, మెస్ ఛార్జీల చెల్లింపులపై సీఎం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే..
బీజేపీలో ఉన్నా ఈటల ఈటలే
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆదివారం నాడు బాలల దినోత్సవం జరగ్గా, తెలంగాణలో అదనంగా ఇంజనీర్స్ డే కూడా జరిగింది. నీటిపారుదల రంగ నిపుణుడు, మాజీ సీఈసీ దివంగత ఆర్. విద్యాసాగర్ రావు జయంతిని తెలంగాణలో ఇంజనీర్స్ డేగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. నెహ్రూ జయంతి, విద్యాసాగర్ రావు జయంతిలపై తెలంగాణ బీజేపీ నేతలెవరూ ప్రకటనలు చేయకపోవడం, ఒకరిద్దరు బాలల దినోత్సవంపై ప్రకటనలుచేసినా నెహ్రూను కించపర్చే కామెంట్లు పెట్టిన దరిమిలా ఈటల మాత్రం తనదైన ప్రత్యేకతను కనబర్చారు.
నెహ్రూ-నీళ్ల సారుకు నివాళి
‘నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు.. వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. మన భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’అని నెహ్రూ జయంతిపై, ‘సమైక్య పాలనలో నీటి పంపిణీలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి, తెలంగాణ సమాజాన్ని తట్టిలేపిన మహనీయులు, సాగునీటి రంగ నిపుణులు శ్రీ ఆర్. విద్యాసాగర్ రావు గారి జయంతి సందర్భంగా.. వారి సేవలను స్మరించుకుంటూ.. వారికి మా ఘన నివాళులు’అని తెలంగాణ ఇంజనీర్స్ డేపై ఈటల పోస్టులు పెట్టడం తెలంగాణవాదులను ఆకట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Etela rajender, Huzurabad By-election 2021, Trs