HOME »NEWS »TELANGANA »husband gave divorce wife married her ex lover read the interesting story here ms kmm

పెళ్లైన 2 నెలలకే 4 నెలల గర్భవతి.. అనుమానించి విడాకులిచ్చిన భర్త.. ఆదరించిన మాజీ ప్రేమికుడు

పెళ్లైన 2 నెలలకే 4 నెలల గర్భవతి.. అనుమానించి విడాకులిచ్చిన భర్త.. ఆదరించిన మాజీ ప్రేమికుడు
షీ టీమ్ సమక్షంలో పెళ్లి జరిపిస్తున్న దృశ్యం

పెళ్లయిన కొన్నాళ్లకు ఆమె అనారోగ్యం పాలైంది. ఆసుపత్రికి వెళ్తే గర్భవతి అన్నారు. పెళ్లయన కొద్ది రోజులకే గర్భిణి ఎలాగంటూ.. చేసుకున్న భర్త అనుమానించాడు. పెద్ద మనుషుల్లో పెట్టి బంధం తెగ్గొట్టేశాడు.

 • News18
 • Last Updated: January 12, 2021, 17:59 IST
 • Share this:
  ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ కొన్నాళ్లు సినిమాలు షికార్లు పేరిట సరదాగా తిరిగారు. ప్రేమ విషయం ఆమె ఇంట్లో తెలిసే సరికి పెద్దవాళ్లు కంగారు పడ్డారు. ఎక్కడ పరిస్థితి చేయిదాటిపోతుందోనన్న భయంతో వేరే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. తెలిసిన వాళ్లలోనే ఓ యువకుడితో బంధువుల సమక్షంలో పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొన్నాళ్లకు ఆమె అనారోగ్యం పాలైంది. ఆసుపత్రికి వెళ్తే గర్భవతి అన్నారు. పెళ్లయన కొద్ది రోజులకే గర్భిణి ఎలాగంటూ.. చేసుకున్న భర్త అనుమానించాడు. పెద్ద మనుషుల్లో పెట్టి బంధం తెగ్గొట్టేశాడు. అసలే అమాయకురాలు.. పైగా గర్భిణి.. ఈలోగా నెలలు నిండాయి. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ భవిష్యత్‌ ఎలాగంటూ భయానికి గురైన తల్లిదండ్రులు ఖమ్మంలోని షీటీం బృందానికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెద్ద మనుషుల మధ్య విడాకులు తీసుకున్నారు కాబట్టి ఇక భర్త విషయంలో చేసేదేం లేకపోవడంతో.. కథను వెనక్కు తిప్పారు.

  ప్రేమించి గర్భవతిని చేసిన యువకుడి గురించి వాకబు చేశారు. అతన్ని పిలిపించారు. ప్రేమికుడికి ఇంకా పెళ్లి కాకపోయేసరికి పోలీసులు పలు దఫాలు కౌన్సెలింగ్‌ జరిపించారు. నమ్ముకున్న యువతికి, పుట్టిన బిడ్డకు న్యాయం చేయాలని సూచించారు. అతని మనసు కరిగింది. పెళ్లికి ఒప్పుకున్నాడు. పోలీసుల సమక్షంలో .. బిడ్డ సాక్షిగా అమాయకురాలైన ఆ యువతి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. దీంతో ఆమె జీవితంలో రేగిన ఓ పెను తుఫానుకు తెరపడింది. పదినెలల కాలంలో చోటుచేసుకున్న అనేక మలుపుల మధ్య ఆమె జీవితంలో హైడ్రామాకు శుభం కార్డు పడింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. సినిమా స్టోరీని తలపించే ఈ కథ ఖమ్మం జిల్లాలో జరిగింది.  నేలకొండపల్లి మండలం చెరువుమాదారానికి చెందిన యడవల్లి పావని, కూసుమంచి మండలం నర్సింహులుగూడెంనకు చెందిన కళ్యాణ్‌లు ప్రేమించుకున్నారు. రెండేళ్లు కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఇరు కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించలేదు. పావనికి వేరే సంబంధం చూసి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులకే అనారోగ్యం పాలైంది. భర్త ఆసుపత్రికి తీసుకెళ్లడంతో నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. పెళ్లయిన రెణ్నెళ్లకే నాలుగునెలల గర్భం ఎలాగంటూ పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టాడు. విడాకులు తీసుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు.

  ఇదీ చదవండి.. మళ్లీ వస్తానని భర్తకు చెప్పి.. నగదు, నగలుతో కలిసి ప్రియుడితో జెండా ఎత్తిన నవ వధువు

  దీంతో ఏంచేయాలో తెలీని స్థితిలో పావని తల్లిదండ్రులు ఖమ్మంలోని షీటీమ్స్‌ ఇన్‌ఛార్జి సీఐ అంజలిని కలిశారు. తమ మొత్తం కథను చెప్పారు. నిజానికి తనకు గర్భం వచ్చిన విషయం కూడా గ్రహించలేని అమాయకస్థితిలో ఉన్న పావనిపై జాలిపడిన ఆమె ఏంజరిగిందన్న దానిపై లోతుగా ఆరా తీశారు. ఎవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలుసుకున్నారు అన్న దానిపై వివరాలు రాబట్టారు. ఆమె గర్భిణి కావడానికి కారకుడైన ప్రేమికుడి గురించి  విచారించారు. అప్పటికీ అతనికి పెళ్లి కాకపోయేసరికి.. ఆమె జీవితాన్ని నిలబెట్టాల్సిన అవసరాన్ని.. బిడ్డకు తండ్రి అవసరాన్ని అర్థమయ్యేలా కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

  ఇదీ చదవండి.. Google Maps: గూగుల్ మ్యాప్స్ ను నమ్మి ముందుకెళ్తే... డ్యామ్ లో ముంచేసింది..

  కొద్ది సిట్టింగ్‌లలోనే అతను పెళ్లికి అంగీకారం తెలపడంతో వారి పని సులువైంది. సోమవారం నాడు షీటీమ్స్‌ ఆఫీసులో ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో.. పుట్టిన బిడ్డ సాక్షిగా పావనికి, కళ్యాణ్‌కు ఆదర్శ వివాహం జరిపించారు. దీంతో పదినెలలుగా ఆమె జీవితంలో రేగిన తుఫాను వెలిసిపోయినట్టు అయింది. పుట్టిన బిడ్డను, ప్రేమించిన భార్యను అక్కున చేర్చుకున్న ఆ ప్రేమికుడు కళ్యాణ్‌ను అందరూ అభినందించారు. ప్రేమించుకన్నాక ఆవేశపడితే ఎలా ఉంటుందో ఇదో సజీవ కథ. ప్రేమికులూ పారాహుషార్‌..
  Published by:Srinivas Munigala
  First published:January 12, 2021, 17:55 IST

  टॉप स्टोरीज