(K.Veeranna,News18,Medak)
దాంపత్య జీవితంలో అనురాగాలు కరువై ..ఆప్యాయతలు దూరమై.. ఓ యాంత్రిక జీవనం గడుపుతున్న ఈ రోజుల్లో ఓ వృద్ధ జంట మా బంధాన్ని చావు కూడ విడదీయలేదని చాటుకున్నారు. చిన్న సమస్యలు, చిరాకులు, అసహనాలతో కాపురాలు కూల్చుకుంటున్న భార్యభర్తలకు ఆ వృద్ధ జంట(Elderly couple) జీవితం ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పాలి. సిద్దిపేట(Siddipeta)జిల్లా చేర్యాల(Cheryala)లో రాలిపోయిన ఇద్దరు పండు వృద్ద దంపతుల మరణవార్త కుటుంబ సభ్యులనే కాదు స్థానికుల్ని కంటతడి పెట్టించింది.
ఎన్నెన్నో జన్మల బంధం..
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన గుడాల రాములు అనే 93సంవత్సరాల వృద్ధుడు మృతి స్థానికుల్ని తీవ్రంగా కలచి వేసింది. 90ఏళ్ల వయసులో చనిపోయన వృద్ధుడి చావు అందర్ని బాధించడానికి వెనుక బలమైన కారణం ఉంది. రాములు దాంపత్య జీవితానికి అండగా నిలిచి..వంశవృక్షాన్ని పెద్దగా చేసిన భార్య సత్తవ్వ ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురైంది. రాములు, సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వాళ్ల సంతానంతో కలిపి మొత్తం 13మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురైన సత్తెవ్వకు భర్త రాములే సేవలు చేశాడు. 70సంవత్సరాలకుపైగా తనకు అండగా ఉన్న భార్య మంచానపడటంతో అన్నీ సపర్యాలు రాములే చేస్తూ వచ్చాడు.
భార్యను మర్చిపోలేక..
ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఈ వృద్ధ జంటకు వయసు పైబడటంతో శుక్రవారం ప్రాణాలు విడిచింది. సత్తెవ్వ అంత్యక్రియలను శనివారం కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఆదివారం సత్తెవ్వను దహనం చేసిన స్మశానంలో చితి దగ్గర మూడో రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే ఉన్న రాములు రెండ్రోజుల క్రితం చనిపోయిన భార్య చితి దగ్గర కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే రాములు మృతి చెందినట్లుగా డాక్టర్లు తేల్చారు.
మృత్యువులోనూ కలిసే ..
కేవలం ఇన్ని సంవత్సరాలు తనతో కలిసి జీవించిన భార్య చనిపోవడంతో బెంగ పెట్టుకున్న రాములు..ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. అందుకే ఆమె చితి దగ్గర అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రాణాలు విడిచి చావు కూడా తమను విడదీయలేదని నిరూపించాడు. ప్రాణంతో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయంగా జీవించిన తల్లిదండ్రులు చావులోనూ కలిసే ప్రాణాలు విడిచిపెట్టడాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Couple died, Siddipeta, Telangana News