(K. Veeranna, News 18, Medak)
సంసారంలో ఆర్థిక ఇబ్బందులు సహజం. అయితే వాటిని భరించలేక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారుతుంది. విడాకులు తీసుకునే వరకూ వెళతారు కొందరు. అలాంటి సందర్భంలో మరికొందరిలో ఒకరు ఆత్మహత్యలకు (Suicide) పాల్పడుతున్నారు. పిల్లల జీవితం, పోషణ ఎలా ఉంటుందో అని ఆలోచించకుండానే రోడ్డుమీద పడేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు అటు పిల్లల జీవితాలనే కాకుండా జీవిత భాగస్వామిని కూడా ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఇలాంటి ఘటనే మెదక్లో చోటుచేసుకుంది. భార్య డ్వాక్రా లోన్ (Dwacra Loan) తీసుకోలేదనే ఆవేశంతో ఓ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మెదక్ (Medak) మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన దుర్గం భాను ప్రసాద్(25) మెదక్ పట్టణానికి చెందిన నాగరాణిని 2016లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్ (Hyderabad) కు వెళ్లి స్థిరపడ్డారు. భాను ప్రసాద్ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆర్ధిక ఇబ్బందులు (Financial problems) తలెత్తడంతో అప్పుల ఊబిలోకూరుకుపోయాడు. ఈ క్రమంలో గ్రామంలో డ్వాక్రా గ్రూపు రుణాలు ఇస్తున్నారనే విషయం తెలుసుకొని ఇటీవల కుటుంబంతో సహా స్వగ్రామానికి వచ్చాడు.
అటు లోన్ లేదు, ఇటు ఆర్ధిక ఇబ్బందులు..
ఇప్పటికే అప్పులు (Debts) ఎక్కువయ్యాయని డ్వాక్రా లోను తీసుకోవద్దని నాగమణి భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. భార్య సలహా నచ్చకపోవడంతో భార్యాపిల్లలను కొట్టాడు భాను ప్రసాద్. అయితే అటు లోన్ తీసుకోలేదు, ఇటు ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఈనెల 16 తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు మెదక్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. అక్కడ కూడా భాను ప్రసాద్ ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలొ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్రెడ్డి తెలిపారు.
సిద్దిపేటలో..
ఇటీవలె సిద్దిపేటలో ఇలాంటి ఘటనే జరిగింది. వర్గల్ ప్రాంతానికి చెందిన మొడుసు రాజిరెడ్డి(32) ప్రైవేట్కంపెనీల్లోని మిషనరీకి తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ వేసే కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. అయితే కరోనా కారణంగా ఆరు నెలలుగా ఒక్క కాంట్రాక్ట్ కూడా దొరక్కపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి రెండేళ్ల పాప, 8 నెలలు గర్భవతి అయిన భార్య అంజలి ఉన్నారు. ప్రస్తుతం ఆమె డెలివరీ కోసం భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజులుగా చేతిలో పైసలు లేవు.. కాన్పు దగ్గర పడుతుంది ఏం చేయాలె అని తల్లి అంజమ్మతో పలుమార్లు చెప్పి రాజిరెడ్డి బాధపడ్డాడు. పని కోసం ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా అయింది. తనలో తను మదనపడుతూ మానసికంగా కుంగిపోతూ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband commit suicide, Medak, Suicide