ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీని ప్రభావం పెద్దగా లేదు. మన వద్ద బర్డ్ ఫ్లూ లేదని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఐతే వికారాబాద్ జిల్లాలో ఓ వింత వ్యాధి కలకలం రేపుతోంది. పెద్ద మొత్తంలో పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. వందల సంఖ్యలో కాకులు, కోళ్లు, నెమళ్లు, కుక్కలు, మేకలు మరణిస్తున్నాయి. ధరూర్, యాలాల మండల్లోని పలు గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న వెటర్నరీ అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు.
తెలంగాణలో బర్డ్ ఫ్లూయే లేదని అధికారులు చెప్పారని.. మరి ఇప్పుడు ఇవన్నీ ఇలా చనిపోతున్నాయో చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వింత రోగాన్ని త్వరగా తేల్చాలని కోరుతున్నారు. మరోవైపు చనిపోయిన పక్షులు, జంతువులను స్థానికులు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పడేస్తున్నారు. వాటిని తిన్న కుక్కలు కూడా అస్వస్థతకు గురై మరణించినట్లు తెలుస్తోంది. దాంతో స్థానికుల్లో మరింత ఆందోళన పెరిగింది. బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉంటుందని భయపడుతున్నారు.
అటు నిజామాబాద్ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. గుండారం గ్రామ శివారులోని శంభుని ఆలయ సమీపంలో ఆరు నెమళ్లు మరణించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. కళేబరాలను పరిశీలించిన తర్వాత అవి బర్డ్ ఫ్లూతో మరణించలేదని చెప్పారు. పొలంలో గుళికల మందు చల్లిన నీటిని తాగడంతోనే తీవ్ర అస్వస్థతకు గురైన నెమళ్లు చనిపోయి ఉంటాయని తెలిపారు. వాటికి పంచనామా నిర్వహించి గోతిలో పూడ్చిపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.