Telangana: రైతు వేసిన బోరు నుంచి వేడి నీళ్లు.. పరిశీలించిన అధికారులు తర్వాత ఏం నిర్ధారించారంటే.. పూర్తి వివరాలు ఇలా..

వేడి నీటి బుగ్గను పరిశీలిస్తున్న అధికారులు

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఓ రైతు వేసిన బోరు నుంచి వేడి నీళ్లు వస్తున్నాయన్న విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి చివరికి అధికారుల దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో సందర్శించి బోరును.. నీటిని పరిశీలించి వేడి నీటి బుగ్గగా నిర్ధారించారు.

 • Share this:
  (జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో ఓ రైతు వేసిన బోరు నుంచి వేడి నీళ్లు వస్తున్నాయన్న విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి చివరికి అధికారుల దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయిలో సందర్శించి బోరును.. నీటిని పరిశీలించారు. ఎండాకాలం కాబట్టి నీరు వేడిగా వస్తోందేమోనని విషయాన్ని తేలిగ్గా తీసుకుని వదిలేశారు. అనంతరం అసలు విషయాన్నే విస్మరించారు. ఇది జరిగింది 1989లో.. కానీ ఈ మధ్య మళ్లీ ఈ విషయం చర్చకు దారితీసింది. సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. పరిశోధన చేశారు. అయితే ఈ సారి తేలిగ్గా కొట్టిపారేయలేదు. అనేక పరీక్షల అనంతరం అది మామూలు బోరు కాదని.. వేడినీటి బుగ్గ అని నిర్ధారించారు. సుమారు 480 మీటర్ల కింది భాగంలో భూగర్భం నుంచి వస్తున్న ఈ నీరు 51 డిగ్రీల సెంటీగ్రేడు వేడి ఉంటున్నట్టు గ్రహించారు. ఈ వేడి నీటి ఆవిరి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చని.. ఈమేరకు సదరు పనికి సంబంధించిన అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కాలుష్య రహితంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది.

  దీనికి అవసరమైన నిధులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో కొంత భాగాన్ని స్థానిక గ్రామీణుల అవసరాలకు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన దాన్ని పంటభూముల అవసరాల కోసం ఇవ్వడానికి సింగరేణి అంగీకారం తెలిపింది. ఈమేరకు వేడి నీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ప్లాంటును నిర్మించే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. దీనికోసం శ్రీరామ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ప్లాంటు నిర్మాణం ప్రారంభం కానుంది. ఇలా జియోథర్మల్‌ పవర్‌ ప్లాంటు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం అంటున్నారు సింగరేణి అధికారులు. ఎలాంటి మోటార్‌ అవసరం లేకుండానే భూగర్భంలోని ఒత్తిడికి పైకి వెల్లువలా వస్తున్న వేడినీరు కొని వందల సంవత్సరాల పాటు వచ్చేంత నిల్వలు ఉన్నాయని సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం నిర్ధారించింది. దీంతో ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ సైకిల్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చని అధికారులు నిర్ణయించారు.

  ఎలాంటి పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు సింగరేణి ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటున్నారు. దీనికోసం జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థతో సర్వే చేయించారు. ప్రస్తుతం 20 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రయోగాత్మకంగా ఆచరణలో విజయవంతం అయితే మరింత విస్త్రుతికి అవకాశం ఏర్పడనుంది. ఏళ్ల తరబడి ఉపరితలానికి ఉబికి వస్తున్న ఈ వేడినీటితో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు సింగరేణి చరిత్రలో మరోమైలు రాయి కానుంది. దీంతో అందరి దృష్టి ప్రస్తుతం దీనిపై కేంద్రీకృతం అయింది.
  Published by:Veera Babu
  First published: