MLC Elections: ఎమ్మెల్సీ ఆశలు.. రేసులో ఉద్ధండులు.. మాజీ మంత్రి తుమ్మలకు దక్కేనా..

ప్రతీకాత్మక చిత్రం

MLC Elections: ఎమ్మెల్సీ.. శాసనమండలి సభ్యత్వం. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌ టాపిక్‌. ఒకవైపు అభ్యర్థిత్వం దక్కించుకోడానికి అధినేతను ప్రసన్నం చేసుకోడానికి ఆశావహులు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కోవిడ్‌ విజృంభన నేపథ్యంలో ఇప్పుడప్పుడే నోటిఫికేషన్‌ ఇవ్వలేమంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా ఆశావహులను నిస్పృహ కమ్మేసింది.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 ఖమ్మం జిల్లా ప్రతినిధి)

  ఎమ్మెల్సీ టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్సీలు.. అందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాలన్నీ శాసనసభ్యుల కోటా నుంచి.. గవర్నర్‌ విచక్షణాధికారాలతో నింపేవి కావడం.. అధినేత మనసులో ఎవరున్నారన్న క్లారిటీ లేకపోవడంతో.. దాదాపు అందరూ వారివారి అవకాశాలను, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా రాష్ట్రంలోని అతిరధ మహారధులెందరో మరోసారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు, సొంత పార్టీలో అసంతృప్తులు, సీనియర్‌ నేతలు.. ఇలా అందరికీ ఒకటే హామీ.. అదే, ‘ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి గౌరవించడం... టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పలువురు నేతలకు పలు సందర్భాల్లో ఈ హామీ ఇచ్చారు. జూన్‌లో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వాటికి అభ్యర్థులను ఎంపిక చేయడం ముఖ్యమంత్రికి ఈసారి పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన చేయబోయే సర్దుబాటుపై సొంత గూటిలోనే ఆసక్తి నెలకొంది. ఏడు ఎమ్మెల్సీ పదవుల్లో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం జూన్‌ 3న పూర్తవుతుండగా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం అదే నెల 16న పూర్తవుతోంది. వాస్తవానికి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్న ఈ స్థానాలు తిరిగి ఆ పార్టీకే దక్కనున్నాయి.

  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్యా బలం దృష్ట్యా వారు ఎమ్మెల్సీలుగా ఏక్రగీవంగా ఎన్నిక కావడం లాంఛనమే. ఇక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కేసీఆర్‌ ఆధ్వర్యంలోని కేబినెట్‌ సిఫారసు చేస్తుంది. ఈ పదవుల కోసం పార్టీలో ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. పార్టీ అధినేత గత 2018లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు నుంచీ అనేక మందికి ఎమ్మెల్సీ పదవి హామీలు ఇస్తూ వస్తున్నారు. మొన్నటికి మొన్న నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక టికెట్‌ రేసులో చివరి వరకు కొనసాగి, భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ‘గులాబీ’ బాస్‌ కేసీఆర్‌ బహిరంగంగానే ప్రకటించారు. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌తో భర్తీ చేశారు. అప్పట్లో ఎమ్మెల్సీ పదవి ఆశించిన అనేక మందికి నిరాశ తప్పలేదు. దాంతో, ఈసారి భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవుల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు సామాజికవర్గాలకు సమన్యాయం జరుగుతుందా.. లేదా అన్న సంశయం దాదాపు అన్ని వర్గాల్లోనూ కనిపిస్తోంది.
  సిట్టింగ్‌ల భవితవ్యం ఏంటో..
  వచ్చే జూన్‌లో పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. సిటింగ్‌ల్లో ఎవరికి రెన్యువల్స్‌ ఉంటాయి? కొత్తగా ఎవరికి పదవులు దక్కుతాయి? అనేది తేలాల్సి ఉంది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వస్తుందని సమాచారం. తాజా రాజకీయ పరిణామాల దరిమిలా సామాజిక కోణంలో అభ్యర్థుల ఎంపిక కీలకమవుతుందని చెబుతున్నారు. అయితే సిట్టింగ్‌లలో కొందరికి మరోసారి అవకాశం లభిస్తుందన్న ఆశల్లో ఎవరికి వారే ఉన్నారు.
  ఇప్పట్లో నోటిఫికేషన్‌ లేనట్టే..
  కోవిడ్‌ మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తారా.. కొన్నాళ్లు ఆపుతారా అన్న విషయంలో సందిగ్దత ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఉండకపోవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి క్లారిటీ వచ్చినా.. మరి ప్రక్రియను ఎప్పుడు చేపడతారు..? అన్న దానిపై క్లారిటీ లేదు. నోటిఫికేషన్‌ విడుదల నుంచి ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ కావాలి. ఇక ఆశావహులంతా ఇప్పటికే అధినేతకు తమ విన్నపాలు వినిపించినట్టు చెబుతున్నారు. రకరకాల సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది.

  పైగా రోజుకోపేరు తెరపైకి వస్తోంది. మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌నేతలు తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, రావుల శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, బండి రమేశ్‌, ఎన్‌.సుధాకర్‌రావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, ప్రభుత్వ మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి, తుల ఉమ, చాడ కిషన్‌ రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు తాడూరి శ్రీనివాస్‌, క్యామ మల్లేశం, పీఎల్‌ శ్రీనివాస్‌ తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి. ఇంకా గతంలో ఉద్యమంలో కేసీఆర్‌తో నడచిన వాళ్లెందరో ఈసారైనా అవకాశం లభిస్తుందా అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: