Telangana: ఇక ఇంటికే రానున్న దేవుని ప్రసాదం.. తపాల శాఖ నుంచి కొత్త పథకం.. ఏ ఏ దేవాలయాల నుంచి ఈ సౌకర్యం ఉందో తెలుసా..

మహబూబ్ నగర్ తపాలా శాఖ కార్యాలయం

ఇకపై ప్రసాదాల కోసం లైన్లో నిల్చోవాల్సిన పనిలేదు. తమకు ఇష్టమైన దేవుని ప్రసాదం ఇక ఇంటికే రానుంది. కరోనా కాలంలో ప్రముఖ ఆలయాలకు వెళ్ళలేని భక్తులకు తపాలా శాఖ ఈ వెసులు బాటు కల్పిస్తోంది.

 • Share this:
  తపాలా శాఖ ఇప్పటికే వివిధ పథకాలతో ప్రజలను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన పథకాలతో పాటు మరొక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పేరుగాంచిన వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు అర్చనలు భక్తులు ఎక్కడినుంచైనా చేయించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నారు. తపాలా శాఖ చేపట్టిన ఈ పథకం మహబూబ్ నగర్ డివిజన్ పరిధిలో ప్రారంభం అయింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇలాంటి సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లకుండానే భక్తులు తమ గోత్రనామాలతో నిత్య కళ్యాణం అభిషేకం అర్చన వంటి పూజలను చేయించి దేవుడి అనుగ్రహం పొందవచ్చు. పూజలు చేయించిన తర్వాత ఆలయాల పూజా విధానాన్ని బట్టి అక్షింతలు పసుపు కుంకుమ , విభూతి, కంకణాలు, జాకెట్ ముక్క, కండువా లాంటి వాటిని పోస్ట్ ద్వారా భక్తులకు అందించనున్నారు. అంతక ముందు ఆశీర్వచనం పేరిట తపాలా శాఖ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదన్నీ భక్తుల చెంతకు చేర్చింది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించి సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.

  సేవ రుసుం ఇలా....
  ఒక్కొ ఆలయ పూజా విధానాన్ని బట్టి రూపాయలు 450, రూ. 600, రూ. 700, రూ. 800, రూ.1216, రూ. 1350, రూ.2600 చొప్పున తపాల శాఖలో ముందుగానే చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ పట్టణ తపాలా శాఖ కార్యాలయం కాకుండా కార్యాలయాలు లేని మారుమూల గ్రామం తండా లో కూడా పోస్ట్ మెన్ ను సంప్రదించి నగదు చెల్లిస్తే బుక్ చేసిన వారం రోజుల్లో నేరుగా ప్రసాదం ఇంటికి వస్తుంది.

  ఈ ఆలయాల్లో అమలు..
  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు బాసరలోని జ్ఞాన సరస్వతి దేవస్థానం, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి, భద్రాచలం సీతా రామ చంద్ర స్వామి , వేములవాడ రాజరాజేశ్వర స్వామి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయం , సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి మాత ఆలయం, గణేష్ ఆలయం , కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, కొండగట్టు అంజన్న, కర్మాంఘాట్ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు..

  విస్తృత ప్రచారం
  దేవాదాయ శాఖ అధికారుల సమన్వయంతో తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నామని.. దీనికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఎస్ కె నరహరి మహబూబ్ నగర్ డివిజన్ తపాలశాఖ పర్యవేక్షకులు ఎస్ కె నరహరి అన్నారు. ఈ అవకాశాన్ని ఎక్కువమంది సద్వినియోగం చేసుకునేలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేపడతామన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో చాలామంది దర్శనాలకు వెళ్లేందుకు ఇష్టపడరు ఈ సమయంలో దేవుడికి సేవలు అందించి ప్రసాదం తెపించుకోవచ్చు అని ఆయన అన్నారు.
  Published by:Veera Babu
  First published: