HIGHEST PRODUCTION OF AGRICULTURE 2019 20 IN TELANGANA BN
తెలంగాణలో రికార్డులు బద్దలు... ఈసారి రైతుల పంట పండింది...
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల దిగుబడి వచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం.. గత ఐదేండ్లలో ఎన్నడూ లేనంతగా పంటల దిగుబడి రావడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సిరుల పంటలు పండాయి. 2019-20 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ స్థాయిలో పంట దిగుబడులు రావడం రికార్డుగా నిలిచింది. ఒక్క వరి పంట గతేడాదితో పోల్చుకుంటే.. 66 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు దిగుబడిని సాధించి చరిత్రను సృష్టించింది. ఈ మేరకు ఆర్థికగణాంక శాఖ వివరాలను వెల్లడించింది. ఒక్క 2019-20 సంవత్సరంలోనే గతంలో ఎన్నడూ లేనంతంగా 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించడం తెలంగాణాకే గర్వ కారణంగా చెప్పుకోవచ్చు.
వాస్తవానికి గత రెండేండ్ల వరకు తెలంగాణలో వరిపంటను పండించొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచించేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలితంగా ఊహించని విధంగా బీడు భూములు పంట భూములుగా మారాయి. ఒకట్రెండు కాదు.. లక్షల ఎకరాలు సస్యశామలంగా మారాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ గ్రామాల్లోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నిజానికి వరి పంట పూర్తిగా నీటి ఆధారితం. దాంతో వరిపంటను నీటి లభ్యత ఉన్నవారు మాత్రమే సాగు చేసేవారు. అదీనూ పంట చివరి వరకు నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోయేవి. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు వరి నుంచి ఇతర పంటల సాగు వైపు రైతులు వెళ్లారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇవ్వడంతో రైతులు అధికంగా వరిసాగు వైపునకు మళ్లారు. దీంతో వరి పంటలే కాకుండా మిగతా ఆహార పంటల దిగుబడి 42 శాతం పెరిగింది. గతేడాదితో పోల్చుకుంటే.. అది 37లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. అధిక శాతం రైతులు వరిసాగు వైపు మొగ్గుచూపడంతో వాణిజ్య పంటల దిగుబడి మాత్రం కాస్తంత తగ్గిందనే చెప్పాలి. ఇకపోతే మిర్చి పంట గతేడాది కంటే 24వేల మెట్రిక్ టన్నులు పెరగగా, నూనె ఉత్పత్తి పంటలు 42వేల మెట్రిక్ టన్నుల మేర పెరిగాయి. తెలంగాణలో ఇప్పటికీ వరి, పత్తి ప్రధాన పంటలుగా కొనసాగుతున్నాయి. ఇందులో వరి ఏకంగా గతేడాది కంటే 66 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి పెరగడం గమనార్హం. గత సంవత్సరంలో పత్తి పంట 48 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అధికంగా వచ్చినట్టు ఆర్థిక గణాంక శాఖ లెక్కలు చెబుతున్నాయి.
వరి పంట దిగుబడి గత ఐదేళ్లుగా ఇలా..
సంవత్సరం
దిగుబడి(లక్షల మెట్రిక్ టన్నుల్లో..)
2014-15
72
2015-16
51
2016-17
101
2017-18
96
2018-19
92
2019-20
130
Published by:Vijay Bhaskar Harijana
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.