రాష్ట్రంలో బీజేపీ- టీఆర్ఎస్ (TRS) వార్ ముదురుతోంది. తాజాగా నల్గొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sajnay) డిమాండ్ చేస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వద్ద ఓ ధాన్యం కొనుగోలు కేంద్రానికి సోమవారం మధ్యాహ్నం చేరుకొన్నారు. బండి సంజయ్ అక్కడికి చేరుకోగానే బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని నల్ల జెండాలను (Black Flags) ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని వారి మధ్య గొడవను ఆపేందుకు యత్నిస్తున్నారు.
కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు..
వరి ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ శ్రేణులు సంజయ్ గో బ్యాక్ (Sanjay Go Back) అంటూ నినాదాలు చేశారు.
Siddipet Collector: ఉద్యోగానికి రాజీనామా చేసిన సిద్ధిపేట కలెక్టర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ?
దీంతో ఆగ్రహం చెందిన బీజేపీ కార్యకర్తలు సంజయ్ టూర్కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై మరొకరు కోడిగుడ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు కలగజేసుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఆ ఉద్రిక్తతల మధ్యే ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ను బండి సంజయ్ పరిశీలించారు. అక్కడి నుంచి బండి సంజయ్ కాసేపట్లో మిర్యాలగూడ వెళ్లారు.
పక్క రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారు..
ఘటన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. తన పర్యటనలో భాగంగా కోడిగుడ్లు, రాళ్లు వేస్తే రైతులకు తగిలాయని పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపైసా కేంద్రం ఇస్తుందని, కోటి లక్షల టన్నుల ధాన్యం కేంద్రం కొన్నదని తెలిపారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే రైతుల సమస్యలు తెలుస్తాయా? అని ప్రశ్నించారు. రైతుల మీద దాడులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాల వారీగా పర్యటనలు..
మరోవైపు వరిధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలోనే నల్గొండ రూరల్(nalgonda) మండలంలోని అర్జాలబావి ఐకేపీ సెంటర్ను బండి సంజయ్ సందర్శించారు. అనంతరం మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నారు. మంగళవారం తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పుల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. ఇక బండి సంజయ్ పర్యటనలో ప్రధానంగా మార్కెట్లో ధాన్యం అమ్మకంపై ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగిన ఘటనతో పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Nalgonda, Trs