HIGH COURT SHOCK TO TELANGANA GOVERNMENT ON GANESH IDOLS IMMERSION IN HUSSAIN SAGAR OF HYDERABAD AK
Ganesh Immersion: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్.. ఆ పిటిషన్ కొట్టివేత
ప్రతీకాత్మక చిత్రం
Telangana: ఈసారికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఆదేశాలను సవరించాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది.
తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఈసారికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేలా ఆదేశాలను సవరించాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. దీనిపై తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని ఆదేశించింది. ఇదే అంశంపై గతేడాది కూడా తాము ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అంశంపై తాము గతంలో ఇచ్చిన అనేక ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ప్రస్తుతం ఈ అంశంలో ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై మరోసారి అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది.
హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో ఏం చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ అంశంపై మరోసారి అప్పీల్ చేసుకోవచ్చని హైకోర్టు సూచించడంతో.. దీనిపై ప్రభుత్వం హైకోర్టులోనే మరోసారి అప్పీల్ చేస్తుందా లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా ? అన్నది తెెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంలో హైకోర్టును ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హుస్సేన్ సాగర్‌లోనే గణేశ్ విగ్రహాల నిమజ్జనం చేసి తీరుతామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. వినాయక చవితికి ఒక రోజు ముందు తీర్పునిచ్చింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. వాటిని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయొచ్చని పేర్కొంది. అది కూడా ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాల నిమజ్జనం చేయొద్దని.. పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వైపు నుంచి నిమజ్జనాలు చేసుకోవాలని సూచించింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్ డ్యామ్ ఏర్పాటు చేసి, అందులో నిమజ్జనం చేయాలని సూచించింది.
నగరంలో వినాయక విగ్రహాలు కలిపి దాదాపు 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనాలు చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో ఎక్కువగా హుస్సేన్ సాగర్‌కే క్యూ కడుతుంటాయి. అయితే ఇప్పటికిప్పుడు కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్న వ్యవహారమంటోంది తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటోంది. భవిష్యత్‌లో ముందస్తు ఆదేశాలిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు హైకోర్టు నో చెప్పడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.