HIGH COURT SERIOUS ON MARIYAMMA LOCK UP DEATH WANTS TO ENQUIRY BY CBI VRY
Mariyamma death case : మరియమ్మ మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం.. సీబీఐ చేత విచారణ..?
తెలంగాణ హైకోర్టు
Mariyamma death case : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరియమ్మ మృతి కేసు మరో కీలకమలుపు తిరిగనుందా... కేసును సీబీఐ అప్పగించాలని హైకోర్టు భావిస్తోందా... మరియమ్మ మృతిపై
నివేదికను అందుకున్న హైకోర్టు నేడు విచారించింది.. ఈ క్రమంలోనే పలు సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ కేసు మరోసారి చర్చనీయంశంగా మారింది. ఆమె మృతిపై చేసిన పౌరహక్కుల సంఘం ధాఖలు చేసిన పిటిషన్లో విచారణ చేపట్టిన హైకోర్టు చాలా సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలోనే మరియమ్మ మృతిపై విచారణ నివేదిక కోర్టుకు అందిన నేపథ్యంలోనే నివేదికను పరిశీలించిన హైకోర్టు బెంచ్, మరియమ్మ కేసు సీబీఐకి అప్పగించదగిన కేసని అభిప్రాయపడినట్టు సమాచారం.దీంతో..ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది.
మరోవైపు ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలపగా.. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించామని ఏజీ తెలపగా.. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకురాగా.. రెండో పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం మరియమ్మ ఒంటిపై గాయాలున్నాయని, గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు ప్రశ్నించింది.
కాగా మరియమ్మ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరును గతంలోనే హైకోర్టు తప్పుబట్టింది. పోలీసుల కస్టడీలో ఎవరైనా చనిపోతే.. చట్టప్రకారం స్థానిక న్యాయమూర్తిచే విచారణ జరిపించాలనే నిబంధన ఉందని ,పోలీసులు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో జరిగిన సంఘటన స్థానిక ఆలేరు జ్యుడిషియల్ విచారణ జరపాలని ఆదేశించింది. నివేదికను నెల రోజుల్లోపు ఇవ్వాలని పేర్కోంది. మరోవైపు రీ పోస్టు మార్టం చేసేందుకు అనుమతి కూడా ఇవ్వాలని మెజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారి చేసింది.
మరోవైపు మరియమ్మ మృతి తర్వాత జాతియ మానవ హక్కుల కమీషన్ చట్టం మేరకు స్థానిక ఆర్డీఓ చేత పోలీసులు విచారణ జరిపించి ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో ఖననం కూడా చేశారు. అయితే సీఆర్పీసి ప్రకరాం పోలీసు కస్టడిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా చనిపోతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాల్సి ఉంటుంది. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి..జ్యుడిషియల్ విచారణకు ఆదేశించడంతో నివేదిక హైకోర్టుకు చేరింది.
ఈ క్రమంలోనే మరియమ్మ మృతిపై సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని పేర్కొంది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణ ఈనెల 22కి వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.