ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు కాపీ వచ్చింది. ఇటీవల ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. తాజాగా ఈ తీర్పుకు సంబంధించిన కాపీలో అనేక కీలక అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పే అని స్పష్టం చేసిన హైకోర్టు.. సిట్ రద్దు చేస్తూ సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి 26 కేసుల బడ్జిమెంట్లను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చింది. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపిస్తూ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సీఎం ప్రెస్‌మీట్‌ను కూడా ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొంది. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదని వెల్లడించింది.
దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేసింది. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని పేర్కొంది. కోర్టు ఆర్డర్‌లో సిట్ ఉనికిని కూడా ప్రశ్నించింది.
ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందన్న హైకోర్టు.. కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ను బహిర్గతం చేశారని పేర్కొంది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎంకు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని తీర్పు కాపీలో పేర్కొంది. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని అభిప్రాయపడింది.
ఇక హైకోర్టు తీర్పు కాపీ రావడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. దీనిపై హైకోర్టులోనే అప్పీల్‌కు వెళతారా ? లేక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా ? అనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ కేసును సీబీఐకు అప్పగించడం తెలంగాణ ఫ్రభుత్వం తమకు ఎదురుదెబ్బగా భావిస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పును తెలంగాణలోని విపక్ష బీజేపీ స్వాగతిస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Telangana High Court