తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో హిడ్మా (Hidma) మృతిపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా (Hidma) చనిపోలేదని సేఫ్ గానే ఉన్నారని మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఈ లేఖ రిలీజ్ చేశారు. హిడ్మా చనిపోయారన్న వార్తల్లో నిజం లేదు. ఆయన సేఫ్ గానే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. దక్షిణ బస్తర్ లో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ పోలీసులు డ్రోన్ లు, హెలికాఫ్టర్ ద్వారా దాడులు చేశారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులు ఏరివేస్తామని అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోస్టులపై ఈ దాడులు చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిఘా పెట్టారు. గతేడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ దాడుల కారణంగా ప్రజలు, రైతులు వారి పనులకు వెళ్లడానికి జంకుతున్నారు.
ఇదిలా ఉంటే నిన్న తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు నేత హిడ్మా (Hidma)మృతి చెందినట్లు వార్తలొచ్చాయి. దీనిపై నిన్న మావోయిస్టులు అధికారిక ప్రకటన చేయలేదు. ఇక తాజాగా నేడు లేఖను రిలీజ్ చేశారు. కాగా 40 ఏళ్ల లోపు వయసున్న హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది. 17 ఏళ్లకే మావోయిస్టుల్లో చేరిన హిడ్మా.. కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు. బస్తర్ ప్రాంతంలోని మురియా గిరిజన వర్గానికి చెందిన మద్వి హిడ్మాను అనే 38 ఏళ్ల వ్యక్తి నక్సల్స్ నాయకుడు. అతడ ఫిలిప్పీన్స్‌లో గెరిల్లా వార్‌ఫేర్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. హిడ్మాను ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని చెబుతారు.
అతడిని హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో 180-250 మంది మావోయిస్టు ఫైటర్స్ ఉంటారు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు కూడా హిడ్మానే. హిద్మా బృందాలు చేసిన అనేక ప్రాణాంతక దాడులలో మే 2013లో కాంగ్రెస్ కాన్వాయ్‌పై జీరామ్ వ్యాలీ ఆకస్మిక దాడి కూడా ఉంది.
ఇందులో చాలా మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వీసీ శుక్లా వంటి నాయకులు సహా దాదాపు 32 మంది మరణించారు. హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.