Home /News /telangana /

HEART FELL SITUATION VILLAGERS CARRYING THE TRIBAL PREGNANT WOMAN ON A DOLI IN ADILABAD ADB PRV

OMG: ఆదివాసీల బతుకింతేనా? డోలీలో గర్భిణి.. ప్రసవానికి 3 కిలోమీటర్ల ప్రయాణం

డోలిపై మోసుకెళుతున్న దృశ్యం

డోలిపై మోసుకెళుతున్న దృశ్యం

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణి మహిళను మూడు కిలోమీటర్ల దూరం డోలిలో మోసుకెళ్లారు. ఆపై అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలో అంబులెన్స్ లొనే ఆ తల్లి ప్రసవించింది. 

    (Lenin, News18, Adilabad)

    వానా కాలం (Monsoon) వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని మారుమూల గిరిజన గూడాల ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో చాలా గూడాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఏదైన అత్యవసరమై గూడెం దాటి వెళ్ళాలంటే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నవాగులు దాటూకుంటూ రావాల్సిందే. మరోవైపు వాగులపై వంతెనలు లేక, సరైన రోడ్డు సౌకర్యం లేక కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. ఏ అవసరం ఉన్నా కాళ్ళకు పనిచెప్పాలిందే. ఈ పరిస్థితుల్లో గిరిజన గూడాల్లో గర్భిణి స్త్రీలు (Pregnant) ప్రసవ సమయంలో ఆసుపత్రికి చేరుకోవాలంటే నానా అవస్థలు పడకతప్పదు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలోనే ప్రసవించిన సంఘటనలు కూడా ఉండగా, పచ్చి బాలింతలు కిలోమీటర్ల దూరం వరకు కాలినడకన నడిచి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల వ్యవధిలోనే ఓ గర్భణి మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళుతున్న సమయంలో వాగు ఒడ్డునే ఓ బిడ్డ (Baby)కు జన్మనిచ్చింది. అది జరిగిన రోజుల తేడాలోనే మరో మహిళ రోడ్డు పైనే ప్రసవించింది.ఈ ఘటనలను మరిచి పోకముందే మళ్లీ మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

    మూడు కిలోమీటర్ల దూరం..

    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (Asifabad) లింగాపూర్ మండలం లేండిగూడ గ్రామానికి చెందిన పర్చకి రాధాబాయి పురిటి నొప్పులు వచ్చాయి. ఆసుపత్రికి వెళ్ళాలంటే సిర్పూర్ (యు) మండల కేంద్రానికి వెళ్ళాలి. దీంతో ఆ గ్రామానికి చెందిన ఏఎన్ ఎం అవ్వాల్ అంబులెన్స్  (Ambulance)కు సమాచారం అందించింది. అయితే లేండిగూడ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ వెళ్లలేక పోయింది. మరోవైపు మహిళకు పురుటి నొప్పులు అధికమవడంతో ఆలస్యం చేయకుండా గ్రామస్థులు డోలి కట్టి, ఆ డోలిలో (Doli) ఆ గర్భిణి మహిళను మోసుకుంటు మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న చోర్ పల్లి గ్రామం వరకు నడిచి వెళ్ళారు. అక్కడి నుండి అంబులెన్స్ అందుబాటులో ఉండటంతో అందులో సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మళ్ళీ అదే అంబులెన్స్ లో అక్కడి నుండి జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు.



    అదే అంబులెన్స్ లో..

    అయితే మార్గ మధ్యలో భూర్నూరు గ్రామ సమీపానికి చేరుకోగానే అదే అంబులెన్స్ లో మహిళ ప్రసవించింది. తల్లిబిడ్డను జైనూరు ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యుడు తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పడంతో అప్పటి వరకు తల్లడిల్లిపోయిన గర్భిణి స్త్రీతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కొంత కుదుటపడ్డారు. దాదాపు రెండు మూడు గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన గూడాలకు మెరుగైన రోడ్డు, రవాణా సదుపాయం కల్పించడంతోపాటు వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత గిరిజనులు అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Pregnant women, Tribes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు