Harish Rao: మళ్లీ ఆ బీజేపీ నేతతో తలపడనున్న హరీశ్ రావు.. ఈసారైనా పైచేయి సాధిస్తారా ?

హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Telangana: హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఆ పార్టీ అప్పగించినట్టు సమాచారం. జితేందర్ రెడ్డి గతంలో దుబ్బాకలోనూ బీజేపీ ఇంఛార్జ్‌గా పని చేశారు.

 • Share this:
  తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి, టీఆర్ఎస్ మాజీ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. ఆయన హుజూరాబాద్ నుంచి మళ్లీ బీజేపీ తరపున బరిలోకి దిగడం దాదాపు ఖాయం కావడంతో.. ఆయనను సొంత నియోజకవర్గంలో ఓడించేందుకు టీఆర్ఎస్ కూడా అప్పుడే పావులు కదుపుతోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను బలోపేతం చేసి.. అక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై హరీశ్ రావు సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

  ఇదిలా ఉంటే బీజేపీ తరపున పోటీ చేయబోయే మాజీమంత్రి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఆ పార్టీ అప్పగించినట్టు సమాచారం. జితేందర్ రెడ్డి గతంలో దుబ్బాకలోనూ బీజేపీ ఇంఛార్జ్‌గా పని చేశారు. దుబ్బాకలో బీజేపీ గెలవడంతో ఆయన పాత్ర ఎంతగానో ఉంది.

  బీజేపీ విజయానికి కావాల్సిన వ్యహాలను సిద్ధం చేసి.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేశారు జితేందర్ రెడ్డి. ఆ రకంగా ఏకంగా దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు తీసుకున్న హరీశ్ రావుకే షాక్ ఇచ్చారు. తాజాగా జితేందర్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు బాధ్యతలు తీసుకోవడంతో.. మరోసారి హరీశ్ రావు వర్సెస్ జితేందర్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం మారనుందనే ప్రచారం సాగుతోంది.

  ఒకవేళ హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే.. ఈటల రాజేందర్‌తో పాటు జితేందర్ రెడ్డికి కూడా క్రెడిట్ దక్కుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దుబ్బాకలో తనకు షాక్ ఇచ్చేలా చేసిన జితేందర్ రెడ్డికి హుజూరాబాద్‌లో హరీశ్ రావు కౌంటర్ ఇస్తారనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి హుజూరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోరు పరోక్షంగా హరీశ్ రావు వర్సెస్ జితేందర్ రెడ్డి అన్నట్టుగా సాగనుందనే వాదన వినిపిస్తోంది.
  Published by:Kishore Akkaladevi
  First published: